తొలకరి ప్రవేశించడంతో రైతులంతా పంటలను సాగు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పంట పండించాలంటే విత్తనాలు కావాలి.. విత్తనాలు సొంతంగా తయారు చేసుకోవడానికి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు... కేవలం ప్రభుత్వం విక్రయించే విత్తనాలు కొనుగోలు చేసి పంటలను కాపాడుకోవాలని సూచిస్తూ రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లోనూ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు అనంతపురం వంటి చోట్ల రైతులకు విత్తనాల కోరత ఏర్పడింది. దీంతో వారు  విత్తన కేంద్రాల నుంచి కలెక్టరేట్ల వరకు కూడా తీవ్ర ఆందోళనలకు పిలుపు నిచ్చారు.

ఈ పరిణామాన్ని ప్రతిపక్షం తనకు అనుకూలంగా మార్చుకుని.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు సంధించింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్ది విత్తనాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన ఐఏఎస్ లు చోద్యం చూశారని జగన్ దృష్టికి వార్తలు వచ్చాయి. దీంతో ఆయన ఆయా జిల్లాల కలెక్టర్లు సహా ఆయా శాఖ ఉన్నతాధికారులపై కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది.

ఇప్పటికే జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దాదాపు 20 మంది ఐఏఎస్ అధికారులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి ఒకింత ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే.. భారీ ఎత్తున ప్రక్షాణకు శ్రీకారం చుట్టారు. ఐఏఎస్ అధికారులను వారి పనితీరు అవినీతి మరకలు సిఫారసులు వంటి వాటిని పరిశీలనలోకి తీసుకుని సమర్ధులైన నిజాయితీ పరులైన అధికారులను ఏరికోరి ఎంచుకుని జిల్లాలకు వేసుకున్నారు.

తన పేషీలోనూ జగన్ సమర్ధులకు మాత్రమే అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు విపక్షం టీడీపీ నుంచి ఎదురవుతున్న విమర్శల నేపథ్యంలో జగన్కు మరింత ఆగ్రహం పెరిగింది. ఆయా జిల్లాలలో రైతులు విత్తనాల కోసం రోడ్డెక్కారు. నిజానికి రాష్ట్రంలో సీడ్ డెఫిసిట్ అనేది గత ప్రభుత్వ హయాం నుంచి కూడా ఉంది.

తను మొదట్లోనే తన ప్రాధాన్యాలను ఐఏఎస్ లకు వివరించానని జిల్లాల్లో ఏ సమస్యలు వచ్చినా.. దానికి కలెక్టరే బాధ్యుడని ఆయన పరిష్కరించలేని సమస్య వస్తే.. వెంటనే తన దృష్టికి తీసుకురావాలని చెప్పినా.. వినకుండా వ్యవహరిస్తే.. ఎలా? అని ఘాటుగానే నిలదీయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జగన్ తన తడాఖాను స్టార్ట్ చేశారు. ఇక పనిచేయకుండా తప్పించుకుంటే కుదరదనే విషయాన్ని ఐఏఎస్ లు గుర్తించాలని అంటున్నారు పార్టీ నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: