తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు తిరుగేలేదు. ఎన్నిక‌లు ఏవైనా గెలుపుమాత్రం గులాబీ ద‌ళానిదే. కానీ.. ఆ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌లో మాత్రం కొంచెం ఆందోళ‌న క‌నిపిస్తోంది. అది ఎప్ప‌టి నుంచి అంటే.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ఫ‌లితాల నుంచే కావ‌డం గ‌మ‌నార్హం. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యాన్ని అందుకున్న టీఆర్ఎస్ పార్టీకి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మాత్రం ఊహించ‌ని షాక్ త‌గ‌లింది. కారు.. సారు.. ప‌ద‌హారు.. నినాదంతో ఎన్నిక‌ల్లోకి వెళ్లిన ఆ పార్టీకి తెలంగాణ జ‌నం భారీ షాక్ ఇచ్చారు. 


ఊహ‌కంద‌ని రీతిలో బీజేపీ నాలుగు స్థానాల్లో విజ‌యం సాధించింది. కాంగ్రెస్ మూడు స్థానాల్లో గెలిచింది. టీఆర్ఎస్ కేవ‌లం 9స్థానాల‌కు ప‌రిమితం అయింది. ఇక ఇదే స‌మ‌యంలో కేంద్రంలో బీజేపీ భారీ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వ‌చ్చింది. ఇప్పుడు ఎలాగైనా తెలంగాణ‌లో పాగా వేయాల‌న్న వ్యూహంతో క‌మ‌లం పెద్ద‌లు క‌దులుతున్నారు. ఈ క్ర‌మంలోనే సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన కిష‌న్‌రెడ్డికి కేంద్ర‌హోంశాఖ స‌హాయ మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. ఇక నిజామాబాద్‌లో కేసీఆర్ కూతురు క‌విత బీజేపీ అభ్య‌ర్థి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. ఇక ఉనికే లేని ఆదిలాబాద్ స్థానాన్ని కూడా బీజేపీ గెలుచుకుంది.

క‌రీంన‌గ‌ర్ స్థానంలోనూ టీఆర్ఎస్ కీల‌క నేత వినోద్‌కుమార్ బీజేపీ అభ్య‌ర్థి బండి సంజ‌య్ చేతిలో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే.. బీజేపీ ఎంపీలున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్ దెబ్బ‌తినకుండా సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లోని ఎమ్మెల్యేల్లో ఒక‌రికి మంత్రి ప‌ద‌వి ఇచ్చి, బీజేపీపై పైచేయి సాధించాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో ప్ర‌ధానంగా క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. 


ఇక్క‌డ విష‌యం ఏమిటంటే.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌మ‌లాక‌ర్ చేతిలో బండి సంజ‌య్ ఓడిపోయారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో సంజ‌య్ భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. ఇక్క‌డ ఆయ‌న దూకుడును త‌గ్గించాలంటే.. క‌మ‌లాక‌ర్‌కు మంత్రి ఇవ్వ‌డం ఒక్క‌టే ప‌రిష్కార‌మ‌న్న ఆలోచ‌నకు కేసీఆర్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లో పాగావేయాల‌ని చూస్తున్న బీజేపీకి అడ్డుక‌ట్ట వేయాలంటే ఇదొక్క‌టి మార్గ‌మ‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు స‌మాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: