అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌ల‌క‌లం చోటు చేసుకుంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీని భారీ వర్షాలు ముంచెత్తాయి. సోమవారం కురిసిన కుండపోత వానలకు రహదారులన్నీ సంద్రాన్ని తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రవాణా, విద్యుత్ వ్యవస్థ స్తంభించింది. విమాన, రైలు సర్వీసులపైనా ప్రభావం పడింది.రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రజా రవాణాకు ఇబ్బందిగా మారింది. పలు చోట్ల రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. విమాన సేవలను రద్దు చేసుకున్నట్టు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు వెల్లడించారు. మరోవైపు వైట్‌ హౌస్‌ బేస్‌మెంట్‌ ప్రాంతం కూడ నీట మునిగింది. 8 సెంమీ వర్షపాతం నమోదు కావడంతో వందలాది ఇండ్లు నీట మునిగాయి. రోడ్లపై ఎక్కడికక్కడ కార్లు నిలిచిపోయాయి. గతంలో ఇలాంటీ వర్షం 1871లో కురిసినట్టు వాతవరణ శాఖ తెలిపింది.  జాతీయ వాతావరణ సేవల సంస్థ వరద హెచ్చరికను జారీ చేసింది. 


 వాషింగ్‌టన్‌ డీసీ నగరంలో సోమవారనుంచి కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లు నదులుగా మారాయి. నార్త్‌ వెస్ట్రర్న్‌ డీసీ, సదరన్‌ మాంట్‌ గోమెరి కౌంటీ, ఈస్ట్‌ సెంట్రల్‌ లౌడౌన్‌ కౌంటీ, అర్లింగన్‌ కౌంటీ, ఫాల్స్‌ చర్చ్‌, నార్తరన్‌ ఫెయిర్‌ పాక్స్‌ కౌంటీ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం వల్ల వరదనీరు భారీగా చేరుకుంది. అమెరికా చరిత్రకు సంబంధించి కీలకమైన దస్ర్తాలను దాచి ఉంచిన నేషనల్ ఆర్కైవ్స్ భవనంలోకి వరద నీరు చేరింది. స్వాతంత్య్ర ప్రకటన, రాజ్యాంగం, హక్కుల బిల్లు తదితర అన్ని డాక్యుమెంట్లు భద్రంగా ఉన్నాయని ఆర్కైవ్స్ సంస్థ తెలిపింది. భారీ వర్షాల ప్రభావం వైట్‌హౌస్‌నూ తాకింది. అక్కడి బేస్‌మెంట్ కార్యాలయాల్లోకి వరద నీరు చేరింది. దీంతో వైట్‌హౌస్ ఉద్యోగులు ఇబ్బందుల పాల‌య్యారు. భ‌ద్ర‌త సిబ్బంది వారిని కాపాడారు. 


పలు ప్రాంతాల్లో కార్లు నీటమునగడంతో వాటిలో ప్రయాణిస్తున్న వాళ్లు కార్లపైకి ఎక్కి సాయం కోసం అర్థించారు. సహాయ సిబ్బంది వారిని రక్షించారు. భారీగా కురుస్తున్న వర్షాలకు పోటోమాక్‌ నది వరద నీటితో పొంగి ప్రవహిస్తోంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని అమెరికా వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరం అయితేనే ఇంటి నుంచి బయటకు రావాలని అధికారులు కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: