పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో నెల‌కొన్న రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌లేదు. మూకుమ్మ‌డిగా ఎమ్మెల్యేల రాజీనామా...ప్ర‌భుత్వాన్ని కూల‌దోసేందుకు ఎత్తుగ‌డ‌లు...బీజేపీ అనూహ్య ప్రణాళిక‌ల‌తో....సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్ర‌మంలో తాజాగా చివ‌రి అస్త్రం వ‌దిలింది. తాజాగా మరో ఎమ్మెల్యే రాజీనామా చేసిన నేపథ్యంలో.. బీజేపీ ధన బలంతో తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతుందని ఆరోపించింది. అసెంబ్లీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరిపై అనర్హత వేటువేయాలని ఆ పార్టీ స్పీకర్‌ను కోరింది.


అధికార‌ కాంగ్రెస్ నేతలు సీఎల్పీ స‌మావేశం ఏర్పాటు చేసుకున్నారు. తాజా సంక్షోభం నేపథ్యంలో తొలిసారి జరిగిన సీఎల్పీ భేటీకి.. రాజీనామా చేసిన 11 మంది ఎమ్మెల్యేలు సహా మొత్తం 20 మంది గైర్హాజరయ్యారు. ఆరోగ్య కారణాలతో తాము రావడం లేదని ఏడుగురు ముందే సమాచారం ఇచ్చారు. అనంతరం స్పీకర్ కేఆర్ రమేశ్‌కుమార్‌ను కలుసుకున్నారు. రెబల్ ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు చట్టం కింద అనర్హత వేటు వేయాలని కోరారు. రెబల్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన ఆధారాలను ఈ నెల 11లోగా సమర్పించాలని స్పీకర్ కాంగ్రెస్ నేతలను కోరినట్టు తెలిసింది. స్పీకర్‌ను కలువడానికి ముందు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు విధానసభ ఎదుటనున్న గాంధీ విగ్రహం వద్ద గంటసేపు ధర్నా చేశారు.


ఓ వైపు నేతలు స్పీకర్‌ను కలుసుకొనేందుకు ప్రయత్నిస్తుండగా, మరో ఎమ్మెల్యే ఆర్ రోషన్‌బేగ్ తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయనను కాంగ్రెస్ ఇటీవల సస్పెండ్ చేసింది. స్పీకర్‌ను కలిసిన అనంతరం పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు మీడియాతో మాట్లాడుతూ, సీఎల్పీలో తీసుకున్న నిర్ణయం మేరకు, రెబల్స్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించామని చెప్పారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీతో చేతులు కలిపారని, అందువల్ల వారికి పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందన్నారు. ఆరేళ్లు వారు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత విధించాలని స్పీకర్‌ను కోరినట్టు మాజీ సీఎం సిద్దరామయ్య చెప్పారు. ఈ నెల 12నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని రెబల్స్ సహా అందరు ఎమ్మెల్యేలను కోరినట్టు తెలిపారు. 


మరోవైపు కాంగ్రెస్ నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డిపై మాత్రం అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరవద్దని నేతలు నిర్ణయించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రామలింగారెడ్డి పార్టీని మాత్రం వీడబోనన్నారు. పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిష్కారానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, బీకే హరిప్రసాద్ బెంగళూరు తరలివచ్చారు. వారిద్దరినీ యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ పంపినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ఇద్ద‌రే...తాజా సంక్షోభం నుంచి పార్టీని గ‌ట్టెక్కిస్తార‌ని...నేత‌లు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: