ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏలుబడి గురించి సంచలన అంశాలు వెలుగులోకి రానున్నాయి. చంద్రబాబు పాలనకు సంబంధించిన ఆర్థిక అంశాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై రూపొందించిన శ్వేతపత్రాన్ని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ బుధవారం విడుదల చేయనున్నారు. తద్వారా, చంద్రబాబు సర్కారు హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అవకతవకలను బయటపెట్టనున్నారు. 


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బీఏసీ సమావేశం గురువారం ఉదయం పదిన్నర గంటలకు జరగనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ,  చర్చించాల్సిన అంశాలపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. గతానికి భిన్నంగా అసెంబ్లీ సమావేశాలకు ఒక రోజు ముందుగానే బీఏసీ సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుండడం గమనార్హం. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలు, భద్రతా తదితర విషయాలపై సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం, ఇతర శాఖల కార్యదర్శులతో స్పీకర్‌ చర్చించారు. 


కీలకమైన బడ్జెట్​ సమావేశాల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై వాస్తవ స్థితిగతులను ప్రజలకు తెలియజెప్పాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఖర్చులు, నిధుల దుర్వినియోగం, ఇతరత్రా అంశాలను సైతం వివరంగా తెలియజేసేందుకు శ్వేతపత్రాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విడుదల చేస్తున్నారని సమాచారం. సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌లో శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా బాబు ఏలుబడిలోని సంచలన వివరాలు వెలుగులోకి రానున్నాయని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: