మాజీ మంత్రి ప‌రిటాల సునీత‌... టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుత బీజేపీ నేత వ‌ర‌దాపురం సూరిపై ప‌రోక్ష విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. అనంత‌పురం జిల్లాలో టీడీపీ కీల‌క నేత‌గా ఉన్న ధ‌ర్మ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి ఎన్నిక‌ల్లో ఓడిపోయాక బీజేపీలో చేరిపోయిన సంగ‌తి తెలిసిందే. జిల్లా స్థాయిలోనే కీల‌క నేత‌గా ఉన్న సూరి పార్టీ మారిపోవ‌డంతో ధ‌ర్మ‌వ‌రం టీడీపీ ఒక్క‌సారిగా దిగాలు ప‌డిపోయింది. ఎట్ట‌కేల‌కు తాజాగా ధ‌ర్మ‌వ‌రంలో కార్య‌క‌ర్త‌ల‌కు ఉత్సాహం ఇచ్చేందుకు ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు ధ‌ర్మ‌వ‌రం టీడీపీ ప‌గ్గాలు పరిటాల కుటుంబానికే అప్పజెబుతున్నామని వేలాది మంది కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రకటించా రు. 


మంగళవారం ఇక్కడి బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ రాప్తాడు, ధర్మవరం రెండు నియోజకవర్గాల బాధ్యతలు పరిటాల కుటుంబానికే ఇస్తున్నామన్నారు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిటాల సునీత‌, శ్రీరామ్ ఎవ‌రు ? ఎక్క‌డ పోటీ చేయాలో వాళ్లే నిర్ణ‌యించుకోవాల‌ని... ఈ ఛాన్స్ వాళ్ల‌కే ఇస్తున్న‌ట్టు కూడా చెప్పారు. ఇక విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం రాప్తాడు బాధ్య‌త‌ల‌ను తిరిగి ప‌రిటాల సునీత‌కే అప్ప‌గించ‌నున్నార‌ట‌.


ఇక ధ‌ర్మ‌వ‌రం ఇన్‌చార్జ్‌గా ప‌రిటాల శ్రీరామ్ వ్య‌వ‌హ‌రిస్తార‌ని తెలుస్తోంది. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ ఓ నాయకుడు ఇదే ధర్మవరంలో తాము మాట్లాడటానికి కూడా అవకాశమివ్వలేదని.... అలాంటి వ్య‌క్తి ఇప్పుడు పార్టీలో లేకుండా పోయాడ‌ని ఎద్దేవా చేశారు. ఇక పార్టీలోకి కొంద‌రు వ‌స్తుంటారు... మ‌రికొంద‌రు పోతుంటార‌ని... వారి గురించి పట్టించుకోనవసరం లేదన్నారు. 


ఈ ఎన్నిక‌ల‌కు ముందే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వ‌ర‌దాపురం సూరిని ప‌క్క‌న పెట్టేసి ఇక్క‌డ నుంచే శ్రీరామ్‌ను పోటీ చేయించాల‌ని సునీత విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు వ‌ర‌దాపురం సూరి క‌నీసం ప‌రిటాల వాళ్ల‌ను ధ‌ర్మ‌వ‌రంలో అడుగు పెట్ట‌నీయ‌లేదు. ఇప్పుడు ఆయ‌న పార్టీ మార‌డంతో ఈ సీటు కూడా ప‌రిటాల చేతుల్లోకి వ‌చ్చేసింది. ఈ క్ర‌మంలోనే సునీత ఇప్పుడు సూరిపై సెటైర్ వేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: