బొల్లినేని శ్రీనివాస్ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మాజీ అధికారి.  సెంట్రల్ జీఎస్టీలో యాంటీ ఎవేషన్ (పన్నుల ఎగవేత వ్యతిరేక విభాగం)లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న గాంధీ ఊహించ‌ని రీతిలో వార్త‌ల్లోకి ఎక్కారు.  ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు రావడంతో ఆయన నివాసాల్లో సోదాలు జరిపారు. హైదరాబాద్‌, విజయవాడలతో పాటు ఏకకాలంలో దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించిన సీబీఐ అధికారులు గాంధీని పట్టేశారు. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ తనిఖీల్లో మొత్తం రూ.3.75 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తించారు. వీరి ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో దాదాపు రూ. 200 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. శ్రీనివాస గాంధీపై సీబీఐ అధికారులు అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో గాంధీ, ఆయన సతీమణి శిరీషాలను కూడా నిందితులుగా చేర్చారు. సీబీఐ సోదాల నేపథ్యంలో గతంలో శ్రీనివాస్ గాంధీ దర్యాప్తుచేసిన ఈడీ కేసుల తీరు మరోమారు తెరపైకి వస్తోంది. 


బొల్లినేని గాంధీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని తనవారికి అనుకూలంగా వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సన్నిహితుడిగా పేరుంది. చంద్రబాబు గ్రూపు వ్యతిరేకులపై నమోదైన హైప్రొఫైల్ కేసుల్లో తనదైన శైలిలో దర్యాప్తు చేసేవాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. . ఏపీ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్‌పై నమోదైన ఈడీ కేసుల్లో నిబంధనలకు మించి గాంధీ జోక్యం ఉండేదన్న ఆరోపణలు ఉన్నాయి. మాజీ కేంద్ర మంత్రి సుజనాచౌదరికంపెనీలపై నమోదైన మనీలాండరింగ్ కేసులను శ్రీనివాస్‌గాంధీ కావాలనే తొక్కిపెట్టారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.


 ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా పనిచేసే సమయంలో జగన్ ఆస్తులను ఎటాచ్ చేయించడంలో బొల్లినేని తన స్నేహితుడైన మరో డైరెక్టర్ ఉమాశంకర్ గౌడ్‌తో కలిసి కీలక పాత్ర వహించాడమే కాకుండా అప్పట్లో చంద్రబాబుకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసి జగన్‌ను అప్రతిష్ట పాల్జేయటంలో ముఖ్యపాత్ర వహించాడని చెబుతున్నారు.  ఎన్నికలకు ముందు జగన్ సతీమణి భారతి పేరును కూడా చేర్పించి సమన్లు జారీ చేయించడంలో కూడా బొల్లినేని కీలకపాత్ర పోషించాడనే అభియోగాలున్నాయి. ఇదే విషయమై జగన్ గుర్తించి నేరుగా ప్రధాని మోదీని కలిసి ఫిర్యాదు చేశారని,  రెండో సారి కోరిన మీదట చెన్నైలోని ప్రాంతీయ కార్యాలయ అధికారులతో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేయించినట్లు చెబుతున్నారు.


విధుల్లో సైతం గాంధీది వివాదాస్ప‌ద కెరీర్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. గాంధీ గతంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం నుచి బదిలీ అయినా అనధికారికంగా నెల రోజులు విధుల్లో కొనసాగారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో 1992లో విధుల్లో చేసిన గాంధీ 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి రావడంతో హైదరాబాద్ కమిషనరేట్‌లో చేరారు. 2003లో డీఆర్‌ఐలో చేరారు. 2004 నుంచి 2007 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన జీఎస్‌టీ సీనియర్ అధికారిగా కొనసాగుతూ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలను ఎదుర్కున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: