అవును జిల్లాలో ఇపుడిలాగే అనుకుంటున్నారు చాలామంది వైసిపి అభిమానులు. వైసిపి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మాజీ ఎంఎల్ఏ ఆమంచి కృష్ణమోహన్  కుటుంబం ప్రత్యర్ధులపై చేస్తున్న దాడులు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. తాజాగా ఓ హోం గార్డుకి ఫోన్ చేసి ఆమంచి అన్న కొడుకు ఆమంచి  రాజేంద్ర బెదిరించిన తీరు సర్వత్రా సంచలనమైంది. దాంతో రాజేంద్రపై పోలీసు కేసు నమోదైంది లేండి.

 

ప్రకాశం జిల్లాలో చీరాల మాజీ ఎంఎల్ఏ ఆమంచి కృష్ణ మోహన్ అరాచకాల గురించి కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. 2014లో సొంతంగా పెట్టుకున్న నవోదయ పార్టీ తరపున గెలిచిన ఆమంచి తర్వాత టిడిపిలో చేరారు. అసలే దూకుడు స్వభావం ఉన్న ఆమంచికి అధికార పార్టీ దన్నుగా కూడా తోడవ్వటంతో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు.

 

చాలామంది టిడిపి ఎంఎల్ఏల్లాగే ఆమంచి కూడా అడ్డదిడ్డంగా డబ్బు సంపాదనలో ఆరితేరిపోయారు. తానంటే పడని ప్రత్యర్ధులపై పోలీసు కేసులు పెట్టించారు. అదే సమయంలో ఎంతోమందిపై భౌతికదాడులు కూడా చేయించారనే ఆరోపణలున్నాయి. ఒక విధంగా తనకు ఎదురుతిరిగిన వారు ఎవరైనా కానీండి ఆఖరుకు టిడిపి నేతలైనా సరే ఏదో కేసులో ఇరికించే వారు. అలాంటిది వైసిపి నేతలు వదులుతారా ?

 

ఎప్పుడెపుడు ఎన్నికలు వస్తాయా ? ఆమంచిని ఓడగొడదామా ? అని జనాలు ఎదురు చూసే స్ధాయికి పరిస్ధితులు దిగజారిపోయినట్లు చీరాలలో పబ్లిక్ టాక్. అలాంటి సమయంలో హఠాత్తుగా ఆమంచి వైసిపిలోనే చేరిపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో అప్పటి వరకూ వైసిపిని అభిమానించిన వారందరికీ జగన్ చేసిన పని నచ్చలేదు. దాంతో వైసిపి అభిమానులంతా ఆమంచిని పూర్తిగా వ్యతిరేకించటం మొదలుపెట్టారు.

 

ఆమంచిపై ఏ స్ధాయిలో వ్యతిరేకత పెరిగిపోయిందంటే రాష్ట్రంలో ముక్కు మోహం తెలీని వాళ్ళు కూడా జగన్ ఫొటో పెట్టుకుని మొన్నటి ఎన్నికల్లో గెలిస్తే  మూడోసారి పోటి చేసిన ఆమంచి మాత్రం 17, 419 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంటే ఏ స్ధాయిలో ఆమంచిపై జనాల్లో వ్యతిరేకతుందో అర్ధమైపోతోంది. అలాంటి ఆమంచి కుటుంబం ఇపుడు మళ్ళీ అరాచకాలకు తెరలేపింది. వైసిపి అధికారంలోకి వచ్చిన నెలకే వీళ్ళ పరిస్ధితి ఇలాగుంటే రేపు మళ్ళీ ఎంఎల్ఏ అయితే ఇంకేమన్నా ఉందా ? అందుకనే ఈ కుటుంబం ఒక్కటి చాలు జిల్లాలో వైసిపిని గబ్బు పట్టించటానికనే టాక్ మొదలైపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: