బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధ్రోణి ప్రభావంతో కడలి కల్లోలంగా మారింది. సముద్ర కెరటాలు ఉవ్వెత్తిన ఎగసిపడుతూ ముందుకు దూసుకొస్తున్నాయి. ఈ పరిస్థితి రెండు రోజుల నుంచి ఉదృక్తంగా మారింది. నాలుగు రోజులుగా అలజడి తీవ్రత నేపథ్యంలో బుధవారం వేకువజామున అక్కుపల్లి శిసాగర్ తీరంలో సముద్రం 200 మీటర్ల ముందుకు వచ్చింది. దీంతో ఇసుక దిబ్బలు, రక్షణ గోడ  కోతకు గురయ్యాయి. 


అదేవిధంగా కెరటాల తాకిడి తీవ్రం కావడంతో కోటి రూపాయలతో చేస్తున్న అధివృద్ధి పనులు రాళ్ళూ, సిమెంట్ దిమ్మలు కొట్టుకుపోయాయి. ఎన్నడూ లేని విధంగా సముద్రం ముందుకు రావడంతో మత్స్యకారులు భయాందోళనలు చెందుతున్నారు. తీరానికి వచ్చిన పర్యాటకులు సైతం బిత్తరపోయారు. ఏళ్ల తరబడి గంగమ్మ తల్లిని నమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్న మత్స్యకారులు ఇక్కడ తీరం దుస్థితిని చూసి విస్తుపోతున్నారు. 


అల్పపీడన సమయంలో సముద్రం కొంత మేరకు వచ్చి వెనక్కి వెళ్ళేదే తప్పా.. ఇంతలా ఎన్నడూ లేదని అక్కడి వారు వాపోతున్నారు. ప్రధానంగా సముద్ర కెరటాల బురదనీరు తీరానికి తాకుతోంది. కడలి కల్లోలంతో అక్కపల్లి శివసాగర్ తీరం కళ తప్పింది. ప్రక్రుతి అందాలతో పర్యాటకులను ఆకట్టుకోవడంతో నిత్యం వందలాది మంది, ప్రత్యేక రోజుల్లో వెలది మంది పర్యాటకులు వచ్చేవారు. కళకళలాడే తీరం ప్రస్తుతం పర్యాటకులు  లేక వెలవెలబోతోంది. జిల్లాలో పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ తీరం కోటి రూపాయలతో తీర్చిదిద్దుతున్న సమయంలో ఇలాంటి దుస్థితి ఏర్పడి కళావిహీనంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: