వానాకాలం మొదలై 40 రోజులు గడుస్తున్నా చినుకు జాడ లేదు. ఫలితంగా సాగు పనులు ముందుకు సాగక అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. తెలంగాఱ ప్రధాన ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 572 టీఎంసీల నీటి కొరత ఉంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, జూరాల ప్రాజెక్టులతోపాటు , ఎస్సారెస్పీ, మిడ్‌ మానేరు, ఎల్‌ఎండీ, నిజాంసాగర్‌, సింగూరు, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు జలకళతప్పిపోయాయి.

గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా ఉంది. అన్ని జలాశయాల్లో నీటి మట్టాలు దాదాపు డెడ్‌లెవల్‌ దిగువకున్నాయి. ఎగువ గోదావరిలో చుక్క నీరు కూడా ప్రవహించడం లేదు. ఉప నదుల్లో ఒక్క ప్రాణహితలోనే ప్రవాహం కనిపిస్తోంది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా, నాసిక్‌ ప్రాంతంలో నెలకొన్న దుర్భిక్షంతో గోదావరి వట్టిపోయింది. ఉత్తర తెలంగాణలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు దాదాపు ఎండిపోయింది. ఈ ప్రాజెక్టు కెపాసిటీ 90.31 టీఎంసీలకు 5.41 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.

గతేడాది ఇదే రోజున జలాశయంలో 12.12 టీఎంసీలు ఉన్నాయి. ఈ యేడాది గోదావరి పరీవాహక ప్రాంతంలో ఒక్క భారీ వర్షం లేదు. ఒక్క వాగు కూడా పొంగలేదు. క్రిష్ణా బేసిన్‌ లోనూ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇక్కడి ప్రాజెక్టుల్లో నిల్వ సామర్థ్యం 537.52 టీఎంసీలకు గాను ప్రస్తుతం 160.82 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. అంటే.. 376.70 టీఎంసీల నీటి కొరత ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా బుధవారానికి 31.90 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే రోజున 29.06 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది.

కాళేశ్వరం కష్టమే?

మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో ప్రాణహితలో 12 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. ఆ నీళ్లను, ప్రధాన పంపుహౌస్‌లో మూడు మోటార్ల ద్వారా అన్నారం బ్యారేజీకి తరలిస్తున్నారు. ఆ నీటిని ఆగస్టు 15 నాటికి మిడ్‌ మానేరుకు తరలిస్తామని అధికారులు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ యేడాది పూర్తిస్థాయి ఎత్తిపోతలు సాధ్యమయ్యే పనికాదని, కాళేశ్వరం నుంచి ఎత్తే నీటిని ఎల్‌ఎండీ దిగువ ఆయకట్టుకు ఇవ్వడం కొంతమేరకు సాధ్యమవుతుందని ఇంజనీర్లు అంటున్నారు.

ఎగువ గోదావరిలో ప్రవాహం వస్తేనే నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, మెదక్‌ పాత జిల్లాలకు సాగునీరు ఇవ్వడానికి వీలుపడుతుందని వారు పేర్కొంటున్నారు. వర్షాభావం వల్ల, అడుగంటిన ప్రధాన ప్రాజెక్టుల వల్ల , ఈ సారి కోటి 8 లక్షల ఎకరాలకు గాను, కేవలం 42లక్షల 75వేల ఎకరాల్లోనే పంటలు పండే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: