ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు...తొలిరోజే హాట్ హాట్‌గా సాగిన సంగ‌తి తెలిసిందే. ఏపీ అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు మ‌ధ్య విమ‌ర్శ‌లు-ప్ర‌తి విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున్నే సాగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం ఎలా వెళ్లారని టీడీపీ అడిగిన ప్రశ్నకు జగన్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ఆవేశంతో ఊగిపోయారు. స్వరం పెంచుకుని.. గుడ్లురుమి చూస్తూ మాట్లాడారు. ఈ ఎపిసోడ్‌పై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర రీతిలో స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఏపీ విప‌క్ష నేత చంద్ర‌బాబు, సినీ క‌మెడీయ‌న్ బ్ర‌హ్మానందం ఒక‌టేన‌ని కామెంట్ చేశారు.

 

స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ....కాళేశ్వరం పూర్త‌య్యాక తాను ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లాననీ.. తాను వెళ్లకపోయినా తెలంగాణ వాళ్లు స్విచ్ నొక్కేవాళ్లని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు గాడిదలు కాశారా అని ఎగతాళిగా మాట్లాడారు జగన్. దీనికి చంద్ర‌బాబు స్పందిస్తూ..``“ఏం తమాషాగా ఉందా. వీళ్లతో అవమానం పాలవ్వడానికి మేం వచ్చామా. వీళ్లతో మాటలు పడటానికి అసెంబ్లీకి వచ్చామా.. వయసును చూసి మాట్లాడే సభ్యత లేదు ముఖ్యమంత్రికి. ఒక సీఎం లెక్కలేని తనంతో మాట్లాడటం ఖండిస్తున్నా. ఈ ఎగతాళి ఎక్కడినుంచి వచ్చింది మీకు. మేం గాడిదలు కాసేవాళ్లలా కనిపిస్తున్నామా.. ఏమనుకుంటున్నారు మీరు.. ఇది పద్ధతాండి.. ఇలా అవమానిస్తారా మమ్మల్ని” అని చంద్రబాబు ఆవేశంగా అన్నారు.

 

దీనిపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ, ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబును చూస్తే బ్రహ్మానందం గుర్తుకువస్తున్నారని సెటైర్ వేశారు. ఆంధ్రా అసెంబ్లీలో చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా సీఎం జగన్ నవ్వుతున్నారని.. అయితే ఒకప్పుడు బ్రహ్మానందాన్ని చూసి… జనాలు కారణం లేకుండా ఇలాగే నవ్వేవారని.. ఇప్పుడు చంద్రబాబును చూస్తే అలాగే నవ్వుతున్నారని వ‌ర్మ‌ త‌న ట్వీట్లో కామెంట్ చేశారు. దీనిపై టీడీపీ న‌తేలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: