తెలంగాణ‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన బీజేపీ ఈ మేర‌కు దూకుడుగా ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు నేత‌ల‌కు కండువా క‌ప్పిన తీరుకు కొనసాగింపుగా తాజాగా మ‌రో ప‌రిణామం చోటుచేసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రితో తెరాస రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌ (డీఎస్‌) భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఆయన ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షా తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ అమిత్ షాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన డీఎస్.. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేదన్న కారణంగా టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి విజయం సాధించారు. కేసీఆర్ కుమార్తె కవిత మీద అరవింద్ 70,875 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. దీంతోపాటు తెలంగాణలో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. 


కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా..సీనియర్ నేతగా వుండే డీఎస్ 2014 ఎన్నికల తరువాత టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. అనంత‌రం ఆయ‌న‌కు రాజ్య‌స‌భ ప‌దవి ద‌క్కింది. అయితే, టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు డీఎస్ కు పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే నెపంతో డీ.శ్రీనివాస్‌పై నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై డి.శ్రీనివాస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌లో తనకు సరైన గుర్తింపు లేదని డీఎస్ ఆవేదన వ్యక్తం చేశారు. త‌న‌పై వ‌చ్చిన  ఫిర్యాదు మేరకు తనను పార్టీ నుండి సస్పెండ్  చేయాలని కూడా డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ అధిష్టానంపై అసహానాన్ని వ్యక్తం చేశారు. కానీ కేసీఆర్ చ‌ర్య తీసుకోలేదు. మ‌రోవైపు పార్టీ బ‌లోపేతానికి బీజేపీ ఎత్తుగ‌డ‌లు వేస్తున్న త‌రుణంలో...ఈ స‌మావేశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: