రైతుల సంక్షేమం కోసం జగన్ ఇప్పటికే ఎన్నో వరాలు ప్రకటించారు. తమ ప్రభుత్వంలో రైతన్నకు ఎటువంటి కష్టం రాకుండా చేస్తానని జగన్ పదే పదే చెబుతున్నారు. తాజాగా జగన్ సర్కారు కౌలు రైతుల కష్టాలు తీర్చడానికి కొత్త విధానం ప్రవేశపెట్టింది. కౌలు ఒప్పందాన్ని 11 నెలలకు పరిమితం చేస్తూ.. ఒప్పంద పత్రమే బ్యాంకుల్లో రుణాలు తీసుకునేందుకు అర్హత కార్డుగా ఉపయోగించుకునేలా ఆదేశాలు జారీ చేస్తోంది. అయితే ఇది అనుకున్నంత సులభమైనదేం కాదు. ఒప్పంద పత్రాలు రాసుకోవాలంటే భూ యజమానులు ససేమిరా అంటారు.


యజమానులు దూర ప్రాంతాల్లో ఉంటూ.. కౌలు రైతులు వ్యవసాయం చేసుకుంటున్న సందర్భాల్లో మాత్రమే ఇలాంటి ఒప్పంద పత్రాలు రెవెన్యూ అధికారులు అందజేస్తుంటారు. అయితే ఇప్పటి వరకూ ఇలాంటి ఒప్పంద పత్రాలను బ్యాంకులు లెక్కలోకి తీసుకునేవి కావు. అప్పటికే భూ యజమానులు పట్టాదారు పాసు పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుంటుంటారు. ఇలా తీసుకున్న రుణాలతో వారు వ్యవసాయం చేయరు, ఇటు వ్యవసాయం చేసే కౌలు రైతుకి బ్యాంకులు రుణాలు ఇవ్వవు.


ఇలాంటి విచిత్ర పరిస్థితుల వల్లే రాష్ట్రంలో రైతులు అల్లాడిపోతున్నారు. పంట సాగు చేసేవాడికి బ్యాంకులు రుణాలివ్వవు, రుణాలు తీసుకున్నవారు సాగు చేయరు. ఈ పరిస్థితి మార్చాలంటే ప్రత్యామ్నాయం కావాల్సిందే. ఈ దిశగానే జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. కౌలు ఒప్పందాల విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తోంది. ఈ మార్పులు నిజమైన రైతులకు న్యాయం చేసేవిగా ఉంటే కచ్చితంగా జగన్ రైతు బాంధవుడిగా చరిత్రలో నిలిచిపోతారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: