మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఇటీవ‌ల‌ కాషాయం కండువా క‌ప్పుకొన్న సంగ‌తి తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ నేత హోదాలో తొలిసారిగా బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాల‌యంలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిన నాదెండ్ల భాస్క‌ర్‌రావు ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బ‌జీఏపీ అగ్ర‌నేత‌ వాజ్ పాయ్ హయంలోనే తాను బీజేపీలో చేరాల్సి ఉండింద‌ని , అయితే అప్పుడు  తన కొడుకు కాంగ్రెస్ తరపున స్పీకర్‌గా పనిచేస్తుండ‌టం వ‌ల్ల బీజేపీలో చేరలేదని తెలిపారు.బీజేపీ తెలంగాణ‌ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ద్వారా బీజేపీ జాతీయ చీఫ్ అమిత్ ఫా తనను పార్టీలో చేరాల్సిందిగా కోరారని, దీంతో కండువా క‌ప్పుకొన్నాన‌ని నాదెండ్ల భాస్కర్ తెలిపారు.

 

 

బీజేపీలో కార్యకర్తలా పనిచేయాలన్నదే తన ఉద్ధేశంమని నాదెండ్ల భాస్క‌ర్‌రావు అన్నారు. ఇటు తెలంగాణలో అటు ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ బలోపేతానికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పారు. పార్టీ కోసం ఏపీ అంతటా తిరిగి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తానని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గిందని, బంధు ప్రీతి, కుల అభిమానం పెరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పని అయిపోయిందని ఆ పార్టీకి నాయకుడే లేకుండా పోయాడని చెప్పారు. బీజేపీ రక్షణలో దేశం సురక్షితంగా ఉందని ప్రధాని మోడీ మొగాడు… మొనగాడని కితాబిచ్చారు.

 

త‌న కుమారుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ గురించి మాట్లాడుతూ, బీజేపీలో చేరాలని ఒత్తిడి ఉందని నాదెండ్ల భాస్కర్‌రావు చెప్పారు. అయితే, పార్టీ మార్పుపై త‌న నిర్ణయం తానే తీసుకుంటారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన మనోహర్‌ ప్రస్తుతం జనసేనలో ముఖ్యనేతగా ఉన్నారు. అయితే, ఆయ‌న బీజేపీలో చేరుతార‌ని కొద్దికాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

ఇదిలాఉండ‌గా, గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనేపూడిలో 1935 జూన్‌ 23న జన్మించిన నాదెండ్ల రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులున్నాయి. 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 వరకూ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 1983లో ఎన్టీఆర్‌తో కలిసి టీడీపీ స్థాపనలో కీలకపాత్ర పోషించానని చెప్పే నాదెండ్ల అదే ఏడాది టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1984లో ఎన్టీఆర్‌ను పీఠం నుంచి దింపేసి సీఎం అయ్యారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 వరకు… అంటే కేవలం నెల రోజులు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తిరిగి 1998లో తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో ఖమ్మం ఎంపీగా గెలిచారు. ఆ తరువాత దశాబ్ద కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన తాజాగా బీజేపీలో చేరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: