ఏరు దాటేదాకా ఏటి మ‌ల్ల‌న్న- అన్న సామెత రాజ‌కీయాల‌కు అచ్చు గుద్దిన‌ట్టు స‌రిపోతుంది. అవ‌స‌రం-అవ‌కాశం అనే రెండు సిద్ధాంతాల ప్రాతిప‌దికగానే రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. నాయ‌కులు కూడా అవ‌స‌రం ఉన్న చోట‌, అవ‌కాశం వ‌చ్చిన చోట జంప్ చేసేందుకు ఎక్క‌డా వెనుకాడ‌డం లేదు. మొత్తంగా త‌మ‌కు అనుకూలంగా ఉన్న చోటును చూసుకు నేందుకు నాయ‌కులు రెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఏపీలో మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో గ‌త అధికార పార్టీ టీడీపీ ఇప్పుడు అధికారం కోల్పోయి ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మైంది. 


అది కూడా చావుత‌ప్పిన విధంగా ఏదో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాను నిల‌బెట్టుకుంది. ఈ క్ర‌మంలో టీడీపీ నుంచి నేత‌ల జంపింగ్‌లు పెరిగి పోతున్నాయి. వాస్త‌వానికి రాజ‌కీయాల్లో అధికారం రావ‌డం, పోవ‌డం అనేది సాధార‌ణం. గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే అయినా.. ఇప్పుడు ఏపీ రాజ‌కీయాలు మాత్రం భిన్నంగా సాగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ఏపీలో పాగా వేసేందుకు వ్యూహాత్మ‌కంగా పావు లు క‌దుపుతోంది. ఎవ‌రు వీక్‌గా ఉన్నారో.. ఏ పార్టీని వీక్ చేయొచ్చో చూసుకుని మ‌రీ క‌మ‌ల నాథులు అడుగులు వేస్తున్నారు. 


ఈ క్ర‌మంలోనే ఇప్పుడు టీడీపీని బ‌ల‌హీన ప‌రిచేందుకు క‌మ‌ల నాథులు వేస్తున్న వ్యూహాలకు చిక్కుకుని టీడీపీ విల విల్లాడుతోంది. టీడీపీకి చెందిన సీనియ‌ర్లు.. జూనియ‌ర్ల‌ను కూడా క‌మ‌లం పార్టీ త‌న చెంతకు చేర్చుకునేందుకు రెడీ అయింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు పార్టీ మారిపోయి.. చంద్ర‌బాబుకు హ్యాండిచ్చారు. ఇక‌, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ సొంత జిల్లా గుంటూరులో టీడీపీని ఖాళీ చేయించే కార్య‌క్ర మానికి శ్రీకారం చుట్టిన‌ట్టు తెలుస్తోంది.


ఈ నేప‌థ్యంలో జిల్లాలోని చాలా మంది టీడీపీ త‌మ్ముళ్లు పార్టీ మారిపో యేందుకు రెడీ అయ్యారు. ముఖ్యంగా పోలీసు కేసుల్లో చిక్కుకున్న వారు బీజేపీ దిశ‌గా అడుగులు వేయాల‌ని నిర్ణయిం చుకున్నారు. ఈ క్ర‌మంలోనే బాప‌ట్ల నుంచి ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన అన్న స‌తీష్ ప్ర‌భాక‌ర్ తాజాగా రెండు రోజుల కింద‌ట బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 


ఈ మార్గంలోనే ఇప్ప‌టికే పార్టీ మారిన రాజ్య‌స‌భ స‌భ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రితో చెలిమి చేస్తున్న గుంటూరుకు చెందిన టీడీపీ నాయ‌కులు.. చందు సాంబ‌శివ‌రావు, ప్ర‌త్తిపాటి పుల్లారావుతో పాటు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజ‌నేయులు స‌హా చాలా మంది బాబుకు హ్యాండిస్తార‌ని స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఒక‌వేళ ఈ నాయ‌కులు క‌ట్ట‌క‌ట్టుకుని క‌మ‌లం గూటికి చేరితే.. గుంటూరులో టీడీపీకి గుండు ఖాయ‌మ‌ని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: