తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశ‌వ్యాప్తంగా సంచలన సృష్టించిన అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ హత్య కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన డుంబ్రిగుంట మండలం లిప్పిట్టిపుట్టు దగ్గర మావోయిస్టుల కాల్పుల్లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ కూడా మృతిచెందారు. ఈ కేసులో నలుగురు నిందితులపై అభియోగాలను ఎన్ఐఏ నమోదు చేసింది. 


విజయవాడలోని కోర్టులో ఎన్‌ఐఏ అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సోమను సానుభూతిపరుల సహకారంతో మావోయిస్టులు హత్య చేసినట్టు చార్జిషీట్‌లో ఎన్‌ఐఏ అధికారులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హ‌త్య‌ కేసులో ఎద్దుల సుబ్బారావు, భీమిలి శోభన్, కమలపై అభియోగాలు నమోదు చేశారు. మావోయిస్టులతో టచ్‌లో ఉండి కిడారి కదలికలను సుబ్బారావు ఎప్పటికప్పుడు వారికి తెలిపేవాడని తేల్చారు. సానుభూతిపరులు ఇచ్చిన సమాచారంతోనే కిడారితో పాటు సోమును టార్గెట్ చేసి మావోయిస్టులు హత్యచేశార‌ని స్ప‌ష్టం చేసింది. 


2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సర్వేశ్వరరావు అనంత‌రం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. మ‌న్యంలో చేస్తున్న కార్య‌క‌లాపాల ప‌ట్ల పలుమార్లు మావోయిస్టులు... ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును హెచ్చరించారు. ఆయనను హెచ్చరిస్తూ మావోయిస్టులు పోస్టర్లు కూడా వేశారు. అనంత‌రం డుంబ్రిగూడ మండలం తుటంగికి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా... ఒక్కసారిగా ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డారు. దాడిలో సుమారు 60 మంది వరకు మావోయిస్టులు పాల్గొన్నారు. వాహన శ్రేణిపై దాడి చేసిన మావోయిస్టులు... మిగతావారిని వాహనాల నుంచి దించివేసి... అతిసమీపం నుంచి ఇద్దరిని కాల్చిచంపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: