ఇటీవ‌ల జ‌రిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ బాటలోనే పలు రాష్ర్టాల పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేశారు. రాహు ల్ తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఆందోళనలు, ఆత్మహత్యాయత్నాలు కూడా చేసినా ఆయన స్పందించడం లేదు. ప్రత్యామ్నాయ అధ్యక్షుడి కోసం కాంగ్రె స్ సీనియర్ నేతలు తీవ్ర చర్చలు జరిపినా ఓ కొలిక్కి రాలేదు. పలు రాష్ర్టాల్లో పార్టీ భవిష్యత్తుపై కేడర్‌లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అమ్మా.. మీరే దిక్కు. పార్టీకి తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టండి అని యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ (72)ని ఆ పార్టీ సీనియర్లు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు.


సోనియానే తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ విధేయులు కోరుతున్నా ఆమె విముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలకు ఆరోగ్యం సహకరించడం లేదని తన సన్నిహితులకు ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. వచ్చే వారం సీడబ్ల్యూసీ సమావేశమై, తాత్కాలిక అధ్యక్షుడిని నియమించే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటివరకు తేదీలు ఖరారు కాలేదు. మరోవైపు తాత్కాలిక అధ్యక్షుడు కాదని, పూర్తికాలపు అధ్యక్షుడినే నియమిస్తారన్న వార్తలు వచ్చినప్పటికీ, కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ‘తాత్కాలికం’ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, రాహుల్ టీంలో సభ్యుడైన జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అత్యంత గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోందని, తొందర్లోనే అధ్యక్షుడిని నియమించాలని డిమాండ్ చేశారు.


లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయం, అధ్యక్ష పదవికి రాహుల్‌ రాజీనామా తదనంతర పరిణామాలతో రాహుల్‌ కోటరీ భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. పార్టీ పరాభవానికి బాధ్యత వహిస్తూ రాహుల్‌ రాజీనామా చేయడంతో.. ఆయన సన్నిహితులూ అదేబాటలో నడిచారు. తాజాగా రాహుల్‌కు అత్యంత సన్నిహితులైన జ్యోతిరాదిత్య సింధియా, మిలింద్‌ దేవ్‌రా పార్టీ పదవులకు రాజీనామా చేశారు. అయితే రాహుల్‌ అనూహ్యంగా అధ్యక్ష పదవి నుంచి వైదొలగడంతో తమ భవిష్యత్తుపై ఆయన సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. పార్టీలో మళ్లీ వృద్ధ నేతలే పెత్తనం చెలాయించే అవకాశం ఉన్నదని వారు కలవరపడుతున్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపికలో తాము పాలుపంచుకోమని సోనియా, రాహుల్‌ స్పష్టం చేసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక నిర్ణయం సీనియర్‌ నేతల చేతుల్లోనే ఉన్నదని వారు భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: