తెలంగాణలో సుమారు రూ.12 వందల కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో, ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని ప్రైవేటు హాస్పిటల్స్‌ ఆలోచన చేస్తున్నాయి. దీనిపై ఈ నెల 16న ఆరోగ్యశ్రీ సీఈవో మాణిక్కరాజ్‌తో సమావేశమై, సమ్మె నోటీసులు ఇవ్వనున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్‌ వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వెల్లడించారు.
ఎందుకిలా..?
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో మొత్తం 246 ప్రైవేటు, 17 కార్పొరేట్‌ ఆస్పత్రులు ఉన్నాయి.
నెలలకొద్దీ బకాయిలు విడుదల చేయకపోవడంతో, ఇప్పటికే కొన్ని ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను తగ్గించాయి. ఆరోగ్యశ్రీ కింద 949 రకాల చికిత్సలను అందించాల్సి ఉండగా, కేవలం ఐదారు రకాల కేసులనే యాక్సెప్ట్‌ చేస్తున్నాయి. ప్రశ్నార్ధకంలో జర్నలిస్టుల హెల్త్‌ కార్డులు ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రంలోని 70 లక్షల కుటుంబాలకు చికిత్స అందిస్తున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇందుకోసం ఏటా రూ.800 కోట్లను ప్రభుత్వం కేటాయిస్తోంది.

సగటున నెలకు రూ.70 కోట్ల నుంచి 80 కోట్ల బిల్లులు జనరేట్‌ అవుతున్నాయి. అయితే కనీసం ఐదారు నెలలకోసారి కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో బకాయిలు వందల కోట్లలో పేరుకుపోతున్నాయి.
'' ఆరోగ్యశ్రీ పరిధిలోకి జర్నలిస్టులను కూడా చేర్చినప్పటికీ , వారి అక్రిడేషన్‌ కార్డులను రెన్యువల్‌ చేస్తున్నారు కానీ, హెల్త్‌ కార్డులను ఇప్పటి వరకు రెన్యువల్‌ చేయక పోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. గతంలో హెల్త్‌కార్డులున్నవారికి కూడా అసుపత్రుల్లో వైద్యం అందలేదని...'' నారాయణ అనే సీనియర్‌ కార్టూనిస్టు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో , పొమ్మనలేక పొగ పెడుతున్నట్టుగా ప్రభుత్వం తమతో వ్యవహరిస్తోందని నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ వారు అంటున్నారు. నేరుగా ఆరోగ్యశ్రీ పథకాన్ని రద్దు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో, పథకాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని డాక్టర్లు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మేలుకొని ఆరోగ్యశ్రీ పట్ల శ్రద్ద పెట్టాలని సామాన్యులు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: