స‌హ‌జంగా, సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలోనే...అనేక చిత్రాలు చోటుచేసుకుంటాయి. ప్ర‌ముఖుల పేరుతో ఓట‌రు కార్డులు జారీ అవుతుంటాయి. వారికి తెలియ‌కుండానే జ‌రిగిపోయే ఈ ప‌రిణామంతో షాక్ తినడం సెలబ్రిటీల వంతు అవుతుంది. ఒక్కోసారి జంతువుల ఫోటోల‌తో కూడా ఇలాంటి కార్డులు జారీ చేయ‌డం వంటి అనేకానేక చిత్ర‌మైన ప‌రిస్థితులు చోటుచేసుకుంటాయి. అయితే, తాజాగా ఓ సెల‌బ్రిటీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో తాజాగా ప్రకటించిన ఓటరు జాబితాలో సినీహీరో మంచు మనోజ్ పేరు నమోదు కావడం చర్చనీయాంశమయింది.


మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు తెలంగాణ రాష్ట్రంలో స‌న్నాహాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయా ప్రాంతాల్లో జాబితా సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఈ త‌ర‌హా ఓట‌రు జాబితాలో, నారాయ‌ణ‌ఖేడ్‌ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు, ఇంటినంబర్ 2-35 చిరునామాతో ఓటరు జాబితాలో 428 వరుససంఖ్యలో మంచు మనోజ్ పేరు ప్రత్యక్షమయింది. తండ్రి మోహన్‌బాబు పేరుతో సహా నమోదు చేశారు. దీంతో అవాక్క‌వ‌డం అధికారుల వంతు అయింది. ఈ విషయంపై నారాయణఖేడ్ మున్సిపాలిటీ కమిషనర్ జీ శ్రీనివాస్ స్పందిస్తూ ఓటరు జాబితాలో మంచుమనోజ్ పేరు పొరపాటున నమోదయిందని చెప్పారు. ఆన్‌లైన్ ప్రక్రియలో భాగంగా జరిగిన సాంకేతిక లోపమే దీనికి కారణమన్నారు. జాబితా సవరణలో భాగంగా దీనిని తొలగించి తుదిజాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు.
ఇదిలాఉండగా, రాష్ట్రంలో నూతన పురపాలక చట్టం అమలులోకి వచ్చిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.  రాష్ట్రంలో నూతన పురపాలకచట్టం తీసుకురావడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు గవర్నర్ నరసింహన్ తరఫున నోటిఫికేషన్ విడుదలచేశారు. శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలకోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 18న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, మరుసటిరోజు (19న) మధ్యాహ్నం రెండు గంటలకు కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమవుతాయని ఈ నోటిఫికేషన్‌లో వెల్లడించారు. తొలిరోజు నూతన పురపాలకచట్టం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఆ ప్రతులను ఎమ్మెల్యేలకు అందించనున్నారు. 19వ తేదీన ఈ బిల్లుకు సభ ఆమోదం తెలుపనున్నది. ఆ తర్వాత ఈ బిల్లును కౌన్సిల్‌లో ప్రవేశపెట్టి ఆమోదం పొందనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: