తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించ‌ని షాక్. అయితే, ఇది పార్టీ మార‌డం వ‌ల్ల కాదు...పార్టీ మారే నేత ఇచ్చిన ట్విస్ట్ వ‌ల్ల‌. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌ పార్టీపై సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ రాజ్‌గోపాల్‌.. బీజేపీ చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్ర‌మంలో...తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో ఎందుకు పోత్తు పెట్టుకున్నారని, ఎవరిని సంప్రదించి పొత్తు కుదుర్చుకున్నారని ప్రశ్నించారు. టీడీపీతో పొత్తు కారణంగానే కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని అన్నారు. పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లు టీఆర్‌ఎస్‌లోకి వెళ్తే రాష్ట్ర నాయకత్వం కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తాజాగా ఆయ‌న రూటు మార్చారు. 

 

 

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఇటీవల ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే తానే సీఎంను అంటూ.. చెప్పుకున్నారు కూడా. అంతేకాదు టీకాంగ్రెస్‌ నేతలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వం బలహీనపడిందని నాయకులు భావిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. కార్యకర్తలతో పాటు ప్రజలంతా కూడా బీజేపీ వైపే చూస్తున్నారని రాజ్‌గోపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని దాదాపు అందరూ భావించారు. 

 

ఇలా క‌ల‌క‌లం సృష్టించిన కోమ‌టిరెడ్డి తాజాగా మాట‌మార్చారు. అస‌లు  తాను పార్టీ మార్చే ఆలోచ‌నే లేద‌న్న‌ట్లు స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై యుద్ధం చేయాలంటే కుంతియా, ఉత్తమ్‌ కుమార్‌లు సరిపోరని మాత్రమే తాను అన్నట్లు చెప్పారు. దానిని తప్పుగా అర్థం చేసుకున్న పార్టీ నేతలు.. షోకాజు నోటీసులు ఇచ్చారని వివరించారు. పార్టీ బాగుకోసమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, అధిష్టానం తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోదని ధీమా వ్యక్తం చేశారు.  కాంగ్రెస్‌ అంటే తనకు ఎంతో అభిమానమని, తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ అని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: