'' 'ఒక్క చాన్స్‌ ప్లీజ్‌' అని వేడుకోవడంతో ప్రజలు కూడా కరిగిపోయి అసాధారణ రీతిలో ఆయనకు 151 సీట్లను అప్పగించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి తాను 'మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను' అని చెబుతూ వస్తున్న జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షానికి మాత్రం చుక్కలు చూపిస్తున్నారు.
ప్రభుత్వ సమీక్షలు, నిర్ణయాలన్నీ చంద్రబాబు టార్గెట్‌గా ఉంటున్నాయి..... ఒక రాజకీయ నాయకుడిగా జగన్మోహన్‌రెడ్డి అలా వ్యవహరించడాన్ని తప్పుబట్టలేం. అయితే ముఖ్యమంత్రిగా జగన్‌ చెబుతున్న మాటలకు, ఆచరణకు పొంతన ఉండటం లేదన్న అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లో ఏర్పడింది.'' ముఖ్యమంత్రి వై.ఎస్‌ . జగన్‌ నెలన్నర పాలన పై ఒక పాపులర్‌ రాజకీయ విశ్లేషకుడి వ్యాఖ్యానం ఇది.

పాలక వర్గం ఆలోచించ దగిన విషయం అది. నిండు అసెంబ్లీలో '' మేం లేస్తే... మీ 23 మంది ఉండరు..'' అని జగన్‌ అవేశపడటం కూడా సమంజసంగా లేదని జగన్‌ అభిమానులు సైతం సోషల్‌ మీడియాలో అంటున్నారు.

'' అవినీతి కేసులలో జగన్మోహన్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపిన సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణను మొన్నటి ఎన్నికలలో ఓడించిన సమాజం మనది. లక్ష్మీనారాయణ వంటి అధికారులను వెక్కిరించేలా జగన్‌కు బంపర్‌ మెజారిటీ కట్టబెట్టిన సమాజం ఇది....'' అని కూడా ఆ రాజకీయ విశ్లేషకుడు అంటున్నారు.

కానీ, ఇది ప్రజాభిప్రాయాన్ని అవమానించడమే, ఎవరిని గెలిపిస్తే తమకు మేలు జరుగుతుందో నిర్ణయించుకోవడం ప్రజస్వామ్యంలో ప్రజలకున్న రాజ్యాంగపు హక్కు.

'' రాజశేఖర్‌రెడ్డిని ఆయన కుమారుడైన జగన్మోహన్‌రెడ్డిలో చూసుకుందామని ఓటేసినవారు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతున్నారు. 'ఏం జరిగినా మీరు సూపర్‌' అని కొంతమంది కీర్తించడం, ఆ మాయలో పడిపోవడం వల్లనే చంద్రబాబు ప్రస్తుత పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డిని కూడా అలాంటి బాకారాయుళ్లు 'అదరగొట్టారు' అని కీర్తిస్తూ ఉండవచ్చు. అయితే ప్రజలందరూ వారివలె ఆలోచించరు. ''అని కూడా ఆ పాపులర్‌ కాలమిస్టు అంటున్నారు.

దీనిలో వాస్తవం ఉంది. ఎక్కడ తగ్గాలో జగన్‌ తెలుసుకుంటే, ఇలాంటి విమర్శకు అవకాశం ఉండదు. ఆయన ముఖ్యమంత్రి అయి రెండు నెలల కూడా కాలేదు.. అపుడే తీర్పులు చెప్పకుండా, కొంత సమయం ఇద్దాం. చంద్రబాబు సీనియారిటీని గౌరవించి, ఆయన సలహాలు తీసుకుని , జగన్‌ మరింత మెరుగైన పాలన అందిస్తారని రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న వారు కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: