కేసులు సత్వర పరిష్కారానికి రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు బబిత పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోర్ట్ ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి కేసులను ఇరువర్గాలు రాజీ మార్గం ద్వారా సత్వరమే పరిష్కరించుకోవచ్చని సూచించారు. దీని వల్ల ధనం , సమయం ఆదా అవుతుందని , కోర్టు చుట్టూ తిరిగే అవసరం లేదని సూచించారు.

ఇరువర్గాల రాజీతో పరిష్కరించుకున్న కేసులను ఇతర కోర్టుల వరకు తీసుకోని వెళ్లే అవసరం లేదన్నారు. ఉభయుల రాజీతో పరిష్కరించబడిన కేసులు అయిందున ఇదే తుది తీర్పు అవుతుందని తెలిపారు. కక్షిదారుల ఉపయోగార్ధం లోక్ అదాలత్ కార్యక్రమాన్ని  జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు, కక్షిదారులు  పెద్ద  ఎత్తున పాల్గొని పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా మొత్తం 1100 కేసులను గుర్తించామని , అందులో 1055 కేసులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

ఇందులో 879 కేసులను పరిష్కరించామని తెలిపారు. తద్వారా రూ.2.81 కోట్ల పరిహారాన్ని అందించినట్లు ఆమె వివరించారు. పరిష్కరించిన కేసుల్లో క్రిమినల్ , సెక్షన్ -138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం , మోటార్  ఏక్సిడెంట్ , ఫామిలీ కోర్ట్ , లేబర్, ఎలక్ట్రసిటీ , నీటి బిల్లులు , ప్రభుత్వ భూసేకరణ  తదితర పెండింగ్ కేసులపై ప్రీ-లిటిగేషన్ కేసులు ఉన్నాయన్నారు. అనంతరం ఇంచార్జ్ సంయుక్త కలెక్టర్ పీ.రజనీకాంతారావు మాట్లాడుతూ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కేసులు సైతం పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ చక్కని మార్గమన్నారు.
ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖలో క్రైమ్ కేసులు ఎక్కవగా పెండింగ్లో ఉన్నాయని అన్నారు. పౌరుషాలకు పోయి ఒక కోర్టు నుంచి మరో కోర్టును ఆశ్రయిస్తున్నారని, దీని వల్ల ధనం , సమయం వృధా అవుతుందని ఆయన అన్నారు. అటువంటి వారందరు లోక్ అదాలత్ ను ఆశ్రయించి సమస్యలను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: