పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క రాజకీయాలు ర‌స‌కందాయంలో ప‌డుతున్నాయి. ప్ర‌భుత్వంలో భాగ‌మైన పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యేల రాజీనామాతో మొదలైన క‌ల‌క‌లం ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌లేదు. తమ రాజీనామాల ఆమోదంపై కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు రెబల్ ఎమ్మెల్యేలు శనివారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. స్పీకర్ రమేశ్ కుమార్ తమ రాజీనామాలను ఆమోదించడం లేదంటూ కాంగ్రెస్‌కు చెందిన ఆనంద్ సింగ్, కే సుధాకర్, మునిరత్న, రోషన్ బేగ్‌తోపాటు రాజీనామాపై అనంతరం పునరాలోచనలో పడిన ఎంబీటీ నాగరాజ్ కూడా పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. ఇటీవల పది మంది రెబల్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్లతో కలిపి విచారణ జరుపాలని వారు కోరారు. రాజీనామాల ఆమోదంపై సుప్రీం కోర్టుకు చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 15కు చేరింది. దీంతో రెబల్స్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.


కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివ కుమార్ శనివారం హస్కోటే ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్ నివాసానికి వెళ్లి సుమారు నాలుగు గంటలకుపైగా చర్చలు జరిపారు. ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరతోపాటు దినేశ్ గుండురావు నాగరాజ్ ఇంటికి వెళ్లి రాజీనామాను వెనక్కి తీసుకోమని కోరాగా ఆయన కాస్త మెత్తబడినట్లు కనిపిస్తున్నది. సాయంత్రం సీఎల్పీ నేత సిద్దరామయ్యను నాగరాజ్ కలిశారు. అనంతరం మీడియాలో మాట్లాడిన ఆయన రాజీనామా వెనక్కి తీసుకోవడంపై స్పష్టత ఇవ్వలేదు. రాజీనామాను వెనక్కి తీసుకుని పార్టీతో కలిసి పని చేయాలని సిద్దరామయ్య, గుండురావు కోరారు. దీనిపై ఆలోచించేందుకు కొంత సమయం కావాలని అడిగా. సుధాకర్(మరో రెబల్ ఎమ్మెల్యే)తో కూడా చర్చలు జరిపి ఓ నిర్ణయం తీసుకుంటా. మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలనుకుంటున్నాము అని నాగరాజ్ తెలిపారు. కాంగ్రెస్‌తో విభేదాలు సమసిపోయాయా అని మీడియా ప్రశ్నించగా.. కొంత అసంతృప్తి వల్లే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇలాంటివి ప్రతి పార్టీలో జరుగుతుంటాయి. రాజీనామా చేసిన ఇతర నేతలతో మాట్లాడి సర్దిచెప్పేందుకు పార్టీ అధిష్ఠానం ప్రయత్నిస్తున్నది. నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తా అని నాగరాజ్ తెలిపారు. కాగా, నాగరాజ్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడని, ఆయన పార్టీలోనే ఉంటారని డీకే శివకుమార్ అన్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, మునిరత్న, రోషన్ బేగ్‌లను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. సీఎం కుమారస్వామి కూడా నలుగురు రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. రాజీనామాలను వారు వెనక్కి తీసుకునే అవకాశమున్నదని ఆయన ఆశిస్తున్నారు. 


సీఎం కుమారస్వామి సోమవారమే బలపరీక్షకు సిద్ధమవ్వాలని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప మీడియాతో అన్నారు. అసెంబ్లీ వ్యవహారాలపై చర్చ సందర్భంగా తాము ఈ విషయాన్ని లేవనెత్తుతామని తెలిపారు. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం పతనం ఖాయమన్న ఆయన, వారు చేస్తున్న బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించవని చెప్పారు. బెంగళూరు శివారులోని రిసార్టులో ఉన్న తమ ఎమ్మెల్యేలను యడ్యూరప్ప కలిశారు. మ‌రోవైపు సీఎం సిద్ధ‌రామ‌య్య కాంగ్రెస్ నేత‌ల‌తో క‌లిసి లంచ్ చేసి సీటు కాపాడేందుకు ప్ర‌య‌త్నం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: