తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణ‌యాలు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న‌ది విభిన్న‌మైన శైలి. ఇలాంటి ప్ర‌త్యేక‌త వ‌ల్లే...ఆయ‌న బ‌తుక‌మ్మ చీర‌లు అంటూ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ కానుక‌ను అందిస్తున్నారు. గ‌తంలో ఈ చీర‌ల పంపిణీ సంద‌ర్భంగా ప‌లు అప‌శృతుల దొర్లిన నేప‌థ్యంలో కేసీఆర్ స‌ర్కారు జాగ్ర‌త్త తీసుకుంటోంది. ఆల‌స్యం అవ‌కుండా స‌మ‌యానికే చీరెలు అందించేందుకు తయారీ వేగవంతం చేశారు. బతుకమ్మ చీరెలను పది డిజైన్లలో, ఒక్కో డిజైన్ పది రంగుల్లో తయారుచేస్తున్నారు. దీంతో వంద వెరైటీల్లో చీరెలు తయారు కానున్నాయి. 

 

 

తెలంగాణ రాష్ట్రంలో  తెల్లరేషన్ కార్డు ఉండి 18 ఏండ్ల నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరెను సీఎం కేసీఆర్ కానుకగా అందజేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి మంది అర్హులు ఉంటారనే అంచనాతో చీరెల తయారీ ప్రారంభించారు. తెలంగాణలో కొంత మంది మహిళలు ఎనిమిది గజాల చీరెలను ధరించేందుకు ఇష్టపడుతారు. ఈ డిమాండ్ నేపథ్యంలో ప్రస్తుతం ఎనిమిది గజాల చీరెలను నేయిస్తున్నారు. ఎనిమిది గజాల చీరెలను 8.2 మీటర్లతో, 80 సెంటీమీటర్లతో జాకెట్‌ను అందిస్తారు. వీరికోసం ప్రత్యేకంగా 10 లక్షల చీరెలను తయారుచేయిస్తున్నారు. ఒకచీరె 5.5 మీటర్లు, జాకెట్ 80 సెంటిమీటర్ల చొప్పున కోటి మందికి మొత్తం 6.3 కోట్ల మీటర్ల చీరె అవసరం. ఇప్పటివరకు రెండుకోట్ల మీటర్ల చీరెలు తయారుచేసినట్టు సమాచారం. చీరెల తయారీని సిరిసిల్లలోని మరమగ్గాలపై తయారుచేసేలా ఆర్డర్లు ఇచ్చారు. వీటి కోసం ప్రభుత్వం రూ.320 కోట్లు వెచ్చించనుంది. తయారైన చీరెలను ఆగస్టు 15 తర్వాత జిల్లాలకు తరలించనున్నారు.

 

సెప్టెంబర్ 28 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభంకానున్న నేపథ్యంలో.. చీరె ల పంపిణీని ఆనెల15 కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. 17 వేల మరమగ్గాల మీద బతుకమ్మ చీరెలు తయారవుతున్నాయి. వచ్చేవారంనాటికి మగ్గాలసంఖ్యను 20 వేలకు పెంచి చీరెల తయారీని వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. చీరెల తయారీతో సిరిసిల్లలో కార్మికులకు ఆరునెలలు చేతినిండా పనిదొరుకుతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కార్మికులకు ప్రతినెలా కనీసం రూ.20 వేలు వేతనంగా అందేలా అధికారులు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: