తాజా ఎన్నిక‌ల్లో ఎదురైన తీవ్ర ఓట‌మి భారం నుంచి టీడీపీ ఇంకా గ‌ట్టెక్క‌లేదు. మంది బలంతో మీది మీదికి ఉరుకుతు న్న వైసీపీని క‌ట్ట‌డి చేసే వ్యూహం వేసేందుకు, వ్యూహాన్ని పారించేందుకు టీడీపీ ఇంకా మీన మేషాలు లెక్కిస్తూనే ఉంది. మ‌రి ఈ క్ర‌మంలో పార్టీకి కావాల్సింది ఏంటి? వ‌్యూహాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి. అధినేత చంద్ర‌బాబు నాయక త్వాన్ని ప‌టిష్టం చేసే దిశ‌గా, పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా అడుగులు వేయాలి. అయితే. ఆదిశ‌గా టీడీపీ నాయ‌కులు చర్యలు తీసుకోవ‌డం మానేసి ట్విట్ట‌ర్‌లో ప‌డి త‌న్నుకులాడుతున్నారు. తాజాగా ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ వీధిన ప‌డి కొట్టు కుంటున్న సీన్ క్రియేట్ చేశారు. 


ట్విట్ట‌ర్ వేదిక‌గా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని సొంత పార్టీ నేత‌ల‌పైనే వ్యాఖ్య‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అటు దేవినేని నాని స‌హా ప‌లువురు నాయ‌కుల‌పై ఆయ‌న దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్ర‌మంలో పార్టీ ప‌రువు బ‌జారున ప‌డుతోం ది. పోనీ .. పార్టీ మారాల‌నే యోచ‌న‌లో ఉన్నారా? అంటే అది కూడాలేదు. కానీ, ట్వీట్ల ఫైర్ మాత్రం ఆగ‌డం లేదు. ఈ క్ర‌మంలో నానిపై తొలిసారి ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న కామెంట్లు చేశారు. దీనిపై నాని అంతే దీటుగా స‌మాధానం ఇచ్చారు. అయితే, ఎక్క‌డా వెంక‌న్న పేరు బ‌య‌ట‌కు రాకుండా నాని జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. 


`` నాలుగు ఓట్లు సంపాదించ లేనివాడు.. నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు.., నాలుగు పదాలు చదవలేనివాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు.. ట్విట్లు చేస్తున్నాడు... దౌర్బాగ్యం!`` అని రాశారు. దీనికి వెంక‌న్న కూడా అదే రేంజ్‌లో కౌంట‌ర్ ఇచ్చారు. యన పేరును ప్రస్తావించకుండానే తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ కోసం పోరాడే వాడు కావాలి తప్ప.. ఇతర పార్టీ నేతలతో కలిసి కూల్చేవాడు కాదు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ బుద్దా వెంకన్న ఏమన్నారంటే.. ‘‘సంక్షోభ సమయంలో పార్టీ కోసం, నాయకుడి కోసం పోరాడేవాడు కావాలి. ఇతర పార్టీల నాయకులతో కలిసి కూల్చేసేవాడు ప్రమాదకరం. నీలాగా అవకాశవాదులు కాదు.. చనిపోయేవరకు చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి’’ అని పేర్కొన్నారు. 


దీంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం తార స్థాయికి చేరింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ ఇద్ద‌రూ విజ‌య‌వాడ‌కు చెందిన కీల‌క నాయ‌కులే కావ‌డం, ఇలా బ‌జారున ప‌డ‌డం వంటివి పార్టీకి మంచిది కాద‌ని అంటున్నారు. అయితే, ఇంత జ‌రుగుతున్నా.. వారం రోజులుగా వీరి మ‌ధ్య ఉప్పు-నిప్పుగా ప‌రిస్థితి ఉన్నా.. అధినేత చంద్ర‌బాబు మాత్రం మౌనంగా ఉండ‌డంపై మ‌రింత విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: