చంద్రబాబుకు అండగా కొన్ని సామాజిక వర్గాల మీడియా అండ ఉందన్న సంగతీ తెలిసిందే. ప్రజలు ఏ ఛానెల్ టీడీపీకి అనుకూలమో ఇప్పటికే ఒక క్లారిటీ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు అదే మీడియా బాబుగారు అధికారంలో ఉన్నపుడు చేసిన తప్పులు అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్పడం గమనార్హం. గత అయిదేళ్లుగా ఆయన చంద్రబాబు మీద ఈగ వాలనివ్వలేదు. చంద్రబాబు కోసం, ఆయన పార్టీ కోసం రాధాకృష్ణ దాదాపు తన పత్రికనే పణంగా పెట్టారు. కానీ చెప్పాల్సిన టైమ్ లో చంద్రబాబు చేస్తున్న తప్పులు మాత్రం చెప్పలేకపోయారు. ఆ విధంగా ఆర్కే అతి పెద్ద తప్పు చేసారు. దానికి మూల్యం చంద్రబాబు చెల్లించారు.


ఆర్కే ఏమన్నారంటే .. 1. ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం చంద్రబాబునాయుడు పార్టీని గాలికి వదిలేశారు. జిల్లాల పర్యటనలకు వెళ్లిన చంద్రబాబు ఒక్కరోజు కూడా పార్టీ కార్యకర్తలతో సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.  2. చంద్రబాబు మార్క్‌ పాలన కనిపించడం లేదని తొలి ఏడాదే ప్రజలలో అభిప్రాయం ఏర్పడినా.. దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించలేదు. 3. పార్టీ శాసనసభ్యుల విచ్చలవిడితనాన్ని అరికట్టవలసిందిపోయి నిస్సహాయుడిగా ఉండిపోయారు. బలమైన వ్యక్తులు– శక్తులు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని పట్టించుకోలేదు.


4. కమ్యూనిజానికి కాలం చెల్లిందంటూ అప్పట్లో అఖిలపక్ష సమావేశాలకు కూడా కమ్యూనిస్టులను ఆహ్వానించకుండా అహం ప్రదర్శించారు. ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు, ఇతర పార్టీల ఉనికిని గుర్తించడానికి ఆయన ఇష్టపడలేదు. 5. చంద్రబాబు పాలనలో అవినీతి తారస్థాయికి చేరిందన్న ప్రచారం గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగినా లెక్క చేయలేదు. దీంతో అభివృద్ధి తెరమరుగై అవినీతి మాత్రమే ప్రజలకు కనిపించింది. 6. ఇసుక సరఫరా, జన్మభూమి కమిటీల వల్ల చెడ్డ పేరు వస్తున్నప్పటికీ పరిస్థితులను చక్కదిద్దకుండా బేఖాతరు చేశారు. ఆర్కే లేటెస్ట్ ప్రవచనాల్లో ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే. ఇన్ని తప్పులు చంద్రబాబు చేసారని, ఆయన గత అయిదేళ్లలో గట్టిగా చెప్పివుంటే బాగుండేది. అలా చేయలేదు. పైగా చంద్రబాబు వీరుడు, శూరుడు, ఆ పార్టీని కొట్టేమగాడే లేడు అంటూ రాసుకువచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: