రెండు రోజుల నుంచి విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య ట్విట్టర్ లో పెద్ద యుద్ధమే జరిగింది. ఒకడేమో కాల్‌ మనీ కేటుగాడట.. ఇంకొకడేమో దొంగ బస్సులు నడిపినోడట.. మరీ, దారుణంగా కొబ్బరి చిప్పలు ఏరుకునేవాడు కూడా తెలుగుదేశం పార్టీలో వున్నాడట. అవునా.? తెలుగుదేశం పార్టీ చరిత్ర ఇంత ఘనంగా మారిపోయిందా.? అని ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.


 'ఆపండిరా బాబూ మీ బూతు పురాణాలు.. పార్టీకి మీ వల్ల ఒరిగిందేమీ లేదుగానీ.. దయచేసి, పార్టీని వదిలి పోండి.. ఓ దరిద్రం వదిలిపోతుంది..' అంటూ సాధారణ కార్యకర్తలు సోషల్‌ మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో వుండాలనుకుంటున్నారో.. బయటకు పోవాలనుకుంటున్నారోగానీ, ఆ పార్టీ ఎంపీ కేశినేని నానిగత కొంతకాలంగా పార్టీ అధినేత చంద్రబాబుకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు.


అడపా దడపా అధికార పక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మీద విమర్శలు చేస్తున్నా, కేశినేని నాని లోలోపల ఖచ్చితమైన ఐడియాతోనే వున్నారు.. అదే తెలుగుదేశం పార్టీఇక పెద్ద షాక్‌ ఇవ్వడం. మరో ఇద్దరు ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్‌లతో పొసగక, పార్టీలో ట్వీటుతో కలకలం రేపిన కేశినేని నాని, ఆ తర్వాత చంద్రబాబు బుజ్జగింపులతో తన విమర్శనాస్త్రాల్ని కొంతకాలం అధికార వైసీపీ మీదకు మరల్చారు. అనూహ్యంగా మళ్ళీ సొంత పార్టీ మీదకు ఫోకస్‌ టర్న్‌ చేశారు. చంద్రబాబుకే డైరెక్ట్‌గా తన లేటెస్ట్‌ ట్వీట్‌తో వార్నింగ్‌ ఇచ్చేశారు కేశినేని నాని. 'మీ పెట్‌ డాగ్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకోకపోతే, నేను పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతాను' అన్నది కేశినేని నాని తాజా ట్వీట్‌ సారాంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: