కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుంది. అందుకు ఈ జొమాటో కుర్రాడే నిదర్శనం. హర్యానాలోని కర్ణాల్‌లో ఉంటాడు. పేరు సూరజ్. ఫుడ్ డెలివరీ యాప్ జొమాటలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఉద‌యం మొద‌లుకుని అర్ధరాత్రి వరకు ఆర్డర్స్ తీసుకుని డెలివ‌రి చేస్తూ క‌ష్ట‌ప‌డుతాడు. అయితే.. సూరజ్‌కు చిరకాల కోరిక ఒకటి ఉంది. కేటీఎం ఆర్సీ 200 బైకుపై తిరగాలన్నది ఆ కోరిక. కానీ అతని స్థాయికి ఆ బైక్ చాలా ఖరీదైనది.

అయినా సూరజ్ వెన‌క్కి తగ్గలేదు. కష్టపడ్డాడు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఫుడ్ డెలివరీలు చేశాడు. కడుపు మాడ్చుకుని మరీ పొదుపు చేశాడు. మొత్తం 5 నెలల జీతం దాచుకున్నాడు. తర్వాత హీరోలా బైక్ షోరూం వెళ్లి తనకిష్టమైన బండిని స్పాట్‌లో నగదు పెట్టి కొనేశాడు. బైక్ ఖరీదు రూ. 2.20 లక్షలకు పైనే. సూరజ్ నెలకు రూ. 40 వేలకు పైగా దాచి మరీ దాన్ని సొంతం చేసుకున్నాడు. అనుకున్న‌ది సాధించాడు. 

జొమాటో వ్యవస్థాపకుడు దీపీందర్ గోయల్.. ఈ విషయం తెలుసుకుని అతని గురించి ట్వీట్ చేశాడు. బండిపై సూరజ్ ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. కష్టపడితే దక్కనిదేదీ ఉండందంటూ నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘నీ అసలు జీతం ఎంతో నిజంగా చెప్పు గురూ?’ అని కొందరు అడుగుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకంటే స్విగ్గీ, జొమాటో బాయ్స్ ఎక్కువ సంపాదిస్తున్నారని టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: