దేశంలో ప్రతీ పనికీ  ఆధార్ నెంబరే  ఆధారం. చిన్నపిల్లనుంచి పెద్దలు, వృద్ధుల వరకూ అదే పెద్ద  దిక్కు. బడిలో చేరాలన్నా , బ్యాంకు ఖాతా తెరవలన్నా , పింఛను పొందాలన్నా , డ్వాక్రా మహిళలకు, ఉపాధిహామీ పథకం వేతనదారులకు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఆధార్ తప్పనిసరి. ఆధార్ ని  ప్రతీ పనికీ వేలిముద్రలతో ముడి పెట్టారు. అంతవరకు  బాగానే ఉన్నా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాల పని తీరుపై అధికారులు  దృష్టి సాదించలేకపోతున్నారు. సాంకేతిక సమస్యలతో పలు కేంద్రాలు మూతపడగా.. ఆధార్ నమోదులతో  పాటు ఆధార్ లో మార్పు, చేర్పులు కోసం కేంద్రాలకు వెళ్లే లబ్ధిదాలకు సేవలు అందక విసిగివేశారిపోతున్నారు.

డివిజన్ కేంద్రం  టెక్కలి నియోజకవర్గంలో అయిదు ఆధార్ నమోదు కేంద్రాలు ఉండగా వాటిలో ప్రస్తుతం రెండే పనిచేస్తున్నాయి. సుమారు 3 లక్షల మందికి పైగా జనాభా  ఉన్నప్పటికీ కోటబొమ్మాళి,నందిగాం,టెక్కలి మండలాల్లో వివిధ కారణాలతో ఆధార్ సేవలు గతేడాది నుంచి నిలుపుదల చేశారు. ప్రస్తుతం సంతబొమ్మాళి లో ఓ   ప్రైవేట్ ఆధార్ నమోదు కేంద్రంతో పాటు నౌపాడలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్లో ఆధార్ నమోదు చేస్తున్నారు. దీంతో నియోజక వర్గ ప్రజలంతా సంతబొమ్మాళి , నౌపాడలోని కేంద్రాల పైనే ఆధారపడుతున్నారు. ప్రతీ రోజూ అధాక సంఖ్యలో ప్రజలు  కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

ఉపాధిహామీ పథకం వేతనదారులకు, రేషన్ కార్డు , పింఛను దారులకు వేలిముద్రలు పడకపోవడంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన చెల్లింపులు నిలిచిపోతున్నాయి. ఆధార్ కార్డులో వేలిముద్రలు అప్ డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తుండడంతో వీరంతా కేంద్రాల్లో నమోదుకు తిరుగుతున్నారు. పాఠశాలల్లో చేర్పించే పిల్లల పేర్లు తప్పుగా నమోదు కావడం, వసతి  గృహాల్లో చేరే విద్యార్థుల బైయోమెట్రిక్ వేలిముద్రలు  నమోదు కాకపోతుండడంతో వారివీ కూడా మరో సారి ఆధార్ కేంద్రా లకు వెళ్లి నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. వీరితో పాటు చిరునామా మార్పులు, ఇంటి పేరు మార్పు, వయసు మార్పు వంటి సమస్యలతో వస్తున్న వారు కూడా కేంద్రాల్లో అయోమయానికి గురవుతూ ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: