గార్డెన్‌లో సన్ బాత్ చేస్తున్న ఓ వ్యక్తి పక్కన హ‌ఠాత్తుగా ఆకాశం నుంచి ఓ శరీరం పడింది. దీంతో.. కంగారుప‌డ్డ ఆ వ్య‌క్తి భ‌యంతో ఒక్క‌సారిగా కేకలు పెట్టాడు. సమాచారం తెలుసుకున్న‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. శరీరం చాలా ఎత్తు నుంచి పడింద‌ని అంచ‌నాకు వ‌చ్చిన  పోలీసులు విమానాశ్రయ అధికారులను సంప్రదించారు. ఆ శరీరం విమానం నుండి పడిందని నిర్ధారించుకున్నారు. 

సౌత్ లండన్ లో చోటుచేసుకున్న ఈ ఘటన ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపింది. విమానం లోపలకి వెళ్లాలంటే ఎన్నో భద్రతా తనిఖీలు పూర్తిచేసుకోవాలి. అలాంటిది ఆ యువకుడు విమానం లోపలకి కాకుండా నేరుగా విమాన చక్రాల(ల్యాండింగ్ గేర్) కంపార్ట్‌మెంట్‌లోకి ఎలా ప్రవేశించడానే సందేహాలు నెలకొన్నాయి.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  కెన్యాలోని నౌరోబీ నుంచి బయల్దేరిన విమానంలోని ల్యాండింగ్ గేర్‌లో ఓ వ్యక్తి అక్రమంగా చొరబడ్డాడు. లండన్‌లోని హీత్రో విమానాశ్రయానికి చేరుకోగానే విమానం రన్‌వేపైకి దిగేందుకు ల్యాండింగ్ గేర్‌లు తెరుచుకున్నాయి. దీంతో ఆ వ్యక్తి పట్టుతప్పి విమానం నుంచి ఓ గార్డెన్‌లో పడ్డాడు. అక్కడ సన్‌బాత్ చేస్తున్న ఓ వ్యక్తికి మీటరు దూరంలో ఆ వ్యక్తి శరీరం పడింది. ఎత్తు నుంచి పడటం వల్ల శరీరం ఛిద్రమై రక్తం గార్డెన్ గోడలపైకి చిమ్మింది. 

దీనిపై కెన్యా ఎయిర్‌వేస్ స్పందిస్తూ.. తమ విమానంలోని ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో ఒక వాటర్ బాటిల్, బ్యాగ్, ఆహారం కనుగొన్నట్లు వెల్లడించింది. దీంతో పోలీసులు అతడు విమానం నుంచి పడి ఉంటాడని నిర్ధారించారు. అయితే, అతడు పడక ముందే చనిపోయాడా, పడిన తర్వాత చనిపోయాడా అనేది తెలియరాలేదు. నౌరోబీ నుంచి హీత్రోకు విమానంలో చేరాలంటే 9 గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో అతడు గాలి ఒత్తిడి వల్ల ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని, ల్యాండింగ్ గేర్ తెరిచిన తర్వాత కంపార్ట్‌మెంట్ నుంచి జారి కిందపడ్డాడ‌ని అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: