విద్యుత్ ఒప్పందాలను   సమీక్షించవద్దని కేంద్రం ఎంత  చెబుతున్న జగన్ సర్కార్ మాత్రం సమీక్షించేందుకే రెడీ అయింది . గత ప్రభుత్వ హయాం లో జరిగిన ఒప్పందాలను సమీక్షించనున్నట్లు విస్పష్టమైన సంకేతాలను ఇస్తున్నారు  . జగన్ సర్కార్ అధికారం లోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తామని పేర్కొనగానే కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి లేఖ రాస్తూ విద్యుత్ ఒప్పందాలను సమీక్షించవద్దని సూచించారు . తాజా  బడ్జెట్ లో ఇదే అంశాన్ని ప్రస్తావించడం తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి,   కేంద్ర ఇంధన శాఖ సహాయ మంత్రి లేఖ రాస్తూ విద్యుత్ ఒప్పందాలను సమీక్షించవద్దని , దాంతో పెట్టుబడిదారులు ఆందోళనకు గురయ్యే ప్రమాదముందని అన్నారు . అయినా జగన్ సర్కార్ , కేంద్ర సూచనలేవీ పరిగణలోకి తీసుకుంటున్నట్లు కన్పించడం లేదు .


అధిక ధరలకు విద్యుత్ ఒప్పందాల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లాం అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా పవన, సౌర విద్యుత్‌ ధరలు గణనీయంగా తగ్గాయని, ఎక్కువ ధరకు విద్యుత్ కొనాల్సిన అవసరం రాష్ట్రాలకు లేదని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పవన విద్యుత్‌ యూనిట్‌ రూ.4.84కు ఒప్పందం చేసుకున్నారని,  పలుచోట్ల దీనికంటే తక్కువ ధరకే విద్యుత్‌ లభ్యమవుతున్నప్పుడు ఇంత ఎక్కువ ధరకు గత ప్రభుత్వం ఎందుకు ఒప్పందం చేసుకోవాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు.  గత ప్రభుత్వం పీపీఏలను రూ.6 లకు ఒప్పందం చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. పీపీఏల వల్ల ఏటా రూ.2,500 కోట్ల ప్రజాధనం అదనంగా ఖర్చయిందని చెప్పారు. టెండరింగ్ లేకుండా ఒప్పందాలు కుదుర్చుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. 


పీపీఏలు లేకుండానే యూనిట్ రూ.2.72లకు అందిస్తామని అనేక కంపెనీలు ముందుకొస్తున్నా… గత ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో తెలియడం లేదన్నారు.  పీపీఏల రద్దు వల్ల పెట్టుబడులు రావన్నది తప్పుడు ప్రచారమని వెల్లడించారు.  ఎప్పుడైనా  విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పారదర్శకంగా ఉండాలని సూచించారు. అందులో భాగంగానే పారదర్శక ఒప్పందాల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.   పీపీఏలు లేకుండానే యూనిట్‌ రూ.2.70కు ఇస్తామని అనేకమంది ముందుకొస్తున్నారని అజేయ కల్లం చెప్పారు. అదానీ, టాటా, ఎస్సార్‌ సంస్థల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయవచ్చన్నారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థలతో చర్చలు జరుపుతామని.. ధరలు తగ్గిస్తే ఆ ఒప్పందాలను కొనసాగిస్తామని అజేయ కల్లం స్పష్టం చేశారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: