ఒక పదవిలో ఎన్నేళ్లుంటారో ఆపదవిని అనుభవించే వారికి తెలీదు. అదీ గవర్నర్ గిరీ అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కానీ.. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ రికార్డు స్థాయిలో ఏకంగా 12 ఏళ్లుగా ఆపదవిలో కొనసాగుతున్నారు. నిఘా విభాగంలో పనిచేసిన నరసింహన్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ క్లాస్ మేట్. కాంగ్రెస్ – బీజేపీ ప్రభుత్వాలను మెప్పించిన ఆ రాజనీతిజ్ఞత నరసింహన్ సొంతం.

 

 

రాజకీయాలకు ఏమాత్రం సంబంధంలేని మాజీ ఐపీఎస్ అధికారి నరసింహన్ ను 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి గవర్నర్ గా నియమించింది. నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ఆయన పనితీరు నచ్చి, 2009లో తెలంగాణ ఉద్యమంతో అల్లకల్లోలంగా ఉన్న ఏపీకి గవర్నర్ గా నియమించింది. చాలా క్లిష్టమైన సమయంలో గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి అప్పటి పరిస్థితులను చాలా చాకచక్యంగా సరిదిద్దారని పేరు కూడా వచ్చింది. 2013లో సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కూడా పరిస్థితులను కంట్రోల్ లో ఉంచారు. 2014 లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. అయినా కూడా ఇంతవరకూ ఏపీకి ప్రత్యేక గవర్నర్ ను నియమించలేదు సరికదా.. నరసింహన్ నే ఒక టర్మ్ మొత్తం కంటిన్యూ చేసింది. దేశంలోని చాలా మంది గవర్నర్లను మార్చిన మోదీ ప్రభుత్వం ఏపీ గవర్నర్ నరసింహన్ జోలికి మాత్రం రాలేదు. కారణం ఆయన పనితీరే. 

 

 

పన్నెండేళ్ల తన గవర్నర్ పదవీకాలంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ గానే జూలై10తో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. రోశయ్య హయాంలో గవర్నర్ గా వచ్చిన నరసింహన్ ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి.. నలుగురి చేత సీఎంగా ప్రమాణస్వీకారం చేయింది ఐదుగురు సీఎంలతో కలిసి పనిచేసిన గవర్నర్ గా పేరు గడించారు. ఇది నిజంగా ఓ రికార్డే. త్వరలో ఏపీకి కొత్త గవర్నర్ ను నియమిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణకైనా నరసింహన్ ను కొనసాగిస్తారో.. లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: