తెలంగాణలో టిడిపి చరిత్ర ఇప్పటికే ముగిసిపోయింది. ఇక పార్టీకి చట్టసభల్లో ఉన్న ఏకైక ఎమ్మెల్యే అశ్వారా పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. స‌త్తుప‌ల్లి నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య ఇప్ప‌టికే పార్టీ మారిపోగా... ఇప్పుడు అశ్వరావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాత్రమే ఆ పార్టీకి ఉన్నారు. సండ్ర‌తో పాటు నాగేశ్వరరావు కూడా పార్టీ మారిపోతారని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిని ఆయన మాత్రం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. తనకు రాజకీయ జన్మ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని...తాను ఉన్నంతకాలం టీడీపీలోనే ఉంటానని చెబుతున్నారు.


ఇదిలా ఉంటే తాజాగా ఖమ్మం జిల్లాలో ఏన్కూరు ఎంపీపీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఈ క్రమంలోనే ఎంపీపీ వరలక్ష్మితో పాటు అక్కడ ఎంపీటీసీలు గెలిచిన టిడిపి వాళ్లను ఎమ్మెల్యే నాగేశ్వరరావు సన్మానించారు. ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా టిడిపి అక్కడ ఎంపీపీ గెలుచుకోవడం చాలా గొప్ప విషయమే అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీకి మిగిలిన ఆ ఒక్క ఎమ్మెల్యేను కూడా తమ పార్టీలోకి రావాలని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రెజ‌ర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు.. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ద్వారా మచ్చిక చేసుకుని ప్రయత్నాలు జరుగుతున్నాయట. పార్టీలోకి వ‌స్తే నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి కావాల్సిన‌న్ని నిధులు కూడా ఇస్తాన‌ని హామీలు ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే విష‌యంపై తాజాగా మెచ్చా కూడా స్పందించారు. పార్టీ మారాలని ఎంత ఒత్తిడి చేసినా తాను లొంగలేదని మెచ్చా తెలిపారు. ఎప్పటికీ పార్టీ మారనని, టీడీపీ కార్యకర్తలకు, నేతలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. టీడీపీ సభ్యత్వాలను ముమ్మరం చేయాలని అన్నారు. ఏదేమైనా కేసీఆర్ తెలంగాణ‌లో టీడీపీకి మిగిలిన ఆ ఒక్క ఎమ్మెల్యేను కూడా కారెక్కించేసుకునే ప్ర‌య‌త్నాలు అయితే ముమ్మ‌రం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: