తాగునీటి కోసం మహిళల మధ్య తలెత్తుతున్న చిన్నపాటి ఘర్షణలతో ప్రాణాలు పోతున్న ఉదంతాలు రాష్ట్రంలో ఎన్నో చోట్ల చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పానిట్టణంలో పల్లివీధిలో ఇద్దరు మహిళలు నీటి కోసం గొడవ పడ్డారు. ఆ ఘర్షణ  వారిలో ఓ మహిళ ప్రాణం తీసేందుకు కారణమైంది. రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఎస్ ఐ కె.వెంకటేష్ వివరాల ప్రకారం ... ఉద్దాన రక్షిత పథకం నుంచి తాగునీరు సరఫరా అవుతుంది. రోజూ నీటి సరఫరా సమయంలో లైన్లో బిందెలు పెట్టుకోవడం వీధిలో వారికి ఆనవాయితీ.

అయితే ఆ సమయంలో తాతపూడి పద్మ (36) ఆమె తల్లి  తెప్పలఈశ్వరమ్మ కంటే వెనుక వచ్చి న అదేవీదికి చెందిన తెప్పల సుందరమ్మ బిందె పెట్టడంతో ఈ ఘర్షణ ఏర్పడింది. ఆ తరువాత సుందరమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. వారిద్దరూ ఎన్నో మాటలు అనుకుంటున్నారని కుళాయి దగ్గర ఉన్న మరో  మహిళ సుందరమ్మకు చెప్పింది. వెంటనే సుందరమ్మ అక్కడకు వచ్చి గొడవ పడి , ఖాళీ బిందెతో దాడి చేసి, పద్మను జుట్టు పట్టి లాగడంతో కింద పడి పోయింది. 

దీంతో  పద్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా వీధివాసులంతా దిగ్బ్రాంతికి గురయ్యారు. మృతురాలు పద్మ, సుందరమ్మ కుటింబీకులు దగ్గర కావడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి కుమార్తె , కుమారుడు ఉన్నారు. తల్లి మృతదేహం వద్ద కుమార్తె రోదిస్తున్న తీరు స్థానికులకు కన్నీళ్లు తెప్పించింది. పద్మ భర్త ప్రసాద్ ఫిర్యాదు మేరకు సోంపేట పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ 304/2 కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: