తమ సమస్యలు పట్టించుకోకుండా జాతీయ రహదారి విస్తిరణకు  జాతీయ రహదారి నిర్వహణ సంస్థ అధికారులు పనులను చేపడుతున్నారని నరసన్న పేట మండలం సత్యవరం గ్రామస్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సత్యవరం కూడలి వద్ద వంతెన నిర్మాణ  పనులు కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. అయితే  ఈ పనులపై గ్రామస్థులు తీవ్ర  అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తమ సమస్యలు పట్టించుకోకుండా జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ ఏకపక్షంగా చేసుకుపోవడం పై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

హడావిడిగా యంత్రాలను దింపి గోతులు తీయడం , మరలా వాటిని కప్పివేయడం వంటివి అనుమానాలకు తావిస్తోందని వారంటున్నారు. పనులు జరిగే ప్రాంతంలో అధికారాల ఆచూకీ లేకుండా సిబ్బందితో నిర్వహించడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాము పనులు చేయనీయమని వారు తేల్చి చెప్పారు. పనిచేసే యంత్రాలను నిలిపివేసి వాహనాల తాళాలు తీసుకున్నారు. దీంతో సిబ్బంది పనులు నిలిపివేసి యంత్రాలను పక్కన పెట్టడంతో వారంతా శాంతించారు. అధికారులు వచ్చి వారు ఏ పనులు చేస్తున్నారో చెప్పాలని , అంతవరకూ పనులు చేయనీయబోమని చెప్పారు. 

సత్యవరం కూడలికి సమీపంలో సుసరాం చెరువు ఉంది . నరసన్న పేట, జలుమూరు మండలాల నుంచి వరద నీరు ఈ చెరువు మీదుగా జాతీయ రహదారిని దాటాల్సి ఉంది. అనంతరం మళ్లీ పలు వంశధార కాలువలను అనుసంధానంచేస్తూ వరదనీరు ప్రవహిస్తుంది. అయితే సత్యవరం కూడలి వద్ద నిర్మాణ పనుల కారణంగా భారీగా వరదనీరు నిలిచి ముప్పు తప్పదని వారంతా ఆందోళన  చెందుతున్నారు. ఈ కూడలి ప్రాంతంలో వరద నీరు సాఫీగా బయటకు వెళ్లేందుకు మార్గాలు చూపాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణాలు ఇలాగే కొనసాగితే సత్యవరం మీదుగా వెళ్లే రెండు మండలాలను కలిపే రహదారిపై రాకపోకలు స్తంభించిపోతాయని భయపడుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: