ఎంటీయూ 1075(పుష్యమి) రకం వరి విత్తనాలు దక్కించుకున్న రైతులు పొలాల్లో వెదల పద్దతిలో జల్లారు. తీరా వర్షాలు కురిసి కర్షకుల్లో ఆనందం వ్యక్తమవుతున్న తరుణంలో విత్తనాలు మొలకెత్తకపోవడం వారిని నిలువునా కృంగదీస్తోంది. పలు గ్రామాల్లో ఎంటీయూ  1075(పుష్యమి) రకం విత్తనాలు మొలకలు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరసన్న పేట మండలంలోని పలు గ్రామాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా కనిపిస్తోంది.

త్వరలో వరి ఊడుపులకు సిద్దమవుతున్న తరుణంలో వరి మొలకలు రాకపోవడం గమనార్హం. భూమిలో నాటిన విత్తనాలు ముచుకు కూడా కానరాకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. నరసన్న పేట , గుండివిల్లి పేట తదితర గ్రామాల్లో విత్తనాలు మొలకెత్తకపోవడం సమస్యాత్మకంగా మారింది. ఇప్పుడిప్పుడే ఈ సమస్య వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఇతర మండలాల్లో కూడా ఈ విత్తనాల సమస్య జఠిలం కానుందని రైతులు భయపడుతున్నారు. 
వ్యవసాయానికి కాలక్రమం అవసరం. సాగుబడిలో ఏ మాత్రం జాప్యం జరిగినా ఏడాది పాటు నష్టపోవాల్సిందే. ప్రకృతి కరుణించకున్న, నిర్లక్ష్యానికి గురైనా పంటకాలం తిరిగి రాదు. దీంతో అన్నదాతలు సాగు కాలం కోసం ఎదురుచూస్తారు. విత్తనాలు జల్లే సమయం కోసం అదును, పదును కోసం వేచి ఉంటారు. అదే ప్రక్రియలో మొలకలు రాకుంటే ప్రత్యామ్నాయం లేక రైతులు మానసిక క్షోభకు గురవుతారు. ప్రస్తుతం అదే జరిగింది. 
ఈ ఏడాది ప్రభుత్వ 1001(విజేత) రకం విత్తనాన్ని రద్దు చేసి, దాని స్థానంలో ఎంటీయూ 1075(పుష్యమి) రకాన్ని రైతులకు పరిచయం చేసింది. దీంతో జిల్లాలోని అత్యధిక శాతం రైతులు వీటిపై ఆసక్తి చూపారు. రోజుల తరబడి వరుసలో నిలిచి విత్తనాలు దక్కించుకున్నారు.  కానీ ఆ విత్తనాలు మొలకలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీనికి ప్రత్యమ్నాయం ఏమిటంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: