వైసిపి నగిరి ఎంఎల్ఏ ఆర్కె రోజా స్పీడుగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. సమస్యలపై స్పందించటం, పంచులు విసరటం, ప్రత్యర్ధులను దుమ్ము దులిపేయటం లాంటి విషయాల్లో రోజా చాలామంది నేతలకన్నా ముందుంటారు. అయితే ప్రత్యర్ధుల విషయంలోనే కాదని అభివృద్ధి కార్యక్రమాల అమలులో కూడా ముందుంటానని తాజాగా నిరూపించుకున్నారు.

 

రాష్ట్రంలో తొందరలో గ్రామ సచివాలయాల వ్యవస్ధ ప్రారంభం కానున్న విషయం అందరికీ తెలిసిందే. గ్రామ, వార్డుల వాలంటీర్ల నియామకానికి ఎంపిక ప్రక్రియ కూడా మొదలైపోయింది. నవరత్నాల అమలులో భాగంగానే గ్రామసచివాలయాలు కూడా ఏర్పాటవుతున్నాయి. అందుకు ప్రతీ గ్రామంలోను ఓ సచివాలయం (కార్యాలయం) భవనాలను ఏర్పాటు చేయటానికి అధికారులు రెడీ అవుతున్నారు.

 

మిగితా గ్రామాల విషయాలు ఎలాగున్నా నగిరి నియోజకవర్గంలోని బుగ్గ అగ్రహారంలో మాత్రం గ్రామ సచివాలయం భవనం నిర్మాణం పూర్తయిపోయింది. ఈ భవనాన్ని రోజా ప్రారంభించేశారు కూడా. గ్రామీణ స్ధాయిలో జనాలకు సంబంధించిన  ప్రతీ వ్యవహారం గ్రామసచివాలయం కార్యాలయం నుండే జరగాలన్నది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం.

 

నగిరిలో గ్రామసచివాలయం సిబ్బంది నియామకం జరిగి వ్యవస్ధ ఏర్పాటవటమే ఆలస్యం. వెంటనే పనులు ప్రారంభించేందుకు కావాల్సిన సౌకర్యాలన్నీ కొత్త కార్యాలయంలో ఏర్పాటయిపోయాయి. రోజా చెప్పిన ప్రకారమైతే రాష్ట్రం మొత్తం మీద మొట్టమొదటగా ఏర్పడిన గ్రామసచివాలయం భవనం మాత్రం తన నియోజకవర్గంలోనే ఏర్పాటైందట.


మరింత సమాచారం తెలుసుకోండి: