గత  తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను సమీక్షించి తీరుతామని రాష్ట్రమంత్రి రంగనాథరాజు తేల్చి చెప్పారు. తెలుగుదేశం  పార్టీ ప్రభుత్వంలో చేస్తున్న విద్యుత్ ఒప్పందాలలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని వైకాపా నాయకత్వం మొదటి నుంచి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే . గత ప్రభుత్వ హయాం లో   విద్యుత్తు ఉత్పత్తి కాకుండానే  పెద్ద ఎత్తున డబ్బులు దోచేశారని ,  ప్రభుత్వ ధనాన్ని కాపాడటం కోసమే విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తామని మంత్రి రంగనాథరాజు తెలిపారు.


వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను సమీక్షించాలని నిర్ణయించింది.  అయితే కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి విద్యుత్ ఒప్పందాలను సమీక్షించ వద్దంటూ  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కు  ఒక లేఖ రాశారు . అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మరొకమారు విద్యుత్తు ఒప్పందాలను సమీక్షించి తీరుతామని బడ్జెట్ సమావేశాల్లో  స్పష్టం చేసింది. దీనితో  కేంద్ర ఇంధన శాఖ మంత్రి రంగంలోకి దిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాస్తూ...  విద్యుత్ ఒప్పందాలు సమీక్షించాలని నిర్ణయం సరి కాదని దీనివల్ల పెట్టుబడిదారులు ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.


అయినా  కేంద్ర ప్రభుత్వం సూచనలను   రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు. విద్యుత్ ఒప్పందాలను సమీక్షించేందుకే జగన్ సర్కార్ మొండిగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు మంత్రులు , వైకాపా నేతల మాటల ద్వారా స్పష్టం అవుతోంది . చూడాలి మరి… టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాల్లో ఏపాటి అవినీతి చోటు చేసుకుందో ? .


మరింత సమాచారం తెలుసుకోండి: