వైకాపా ప్రభుత్వం పై  ఎదురుదాడికి తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో  గత ప్రభుత్వ హయాం అవినీతి అక్రమాలే తప్పితే , అసలు అభివృద్ధి అన్నది జరగలేదన్నట్లుగా అధికార వైకాపా పార్టీ  ఆరోపణలు చేస్తుండడంతో టీడీపీ నాయకత్వం ఉక్కిరి, బిక్కిరి అవుతోంది. సభలో తమకు అధికార పార్టీ మాట్లాడేందుకు సరైన సమయం ఇవ్వడం లేదని ఆరోపిస్తోన్న  టీడీపీ సభ్యులు , ఇక అవకాశం దొరికిన ప్రతిసారి వైకాపా ప్రభుత్వం పై విరుచుకుపడాలని నిర్ణయించారు . దానిలో భాగంగానే టీడీపీ వ్యూహ కమిటీ సభ్యులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో చంద్రబాబు,  వైకాపా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు .


విద్యుత్ పీపీఏ  ఒప్పందాలను సమీక్షించాలని ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  నిర్ణయాన్ని ఆయన తప్పు పట్టారు.  కేవలం గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పై  బురద చల్లేందుకే విద్యుత్  ఒప్పందాలను సమీక్షించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని ఆయన ఆక్షేపించారు.  టీడీపీ ప్రభుత్వ హయాంలో  సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వలేదన్న జగన్,  చివరకు ఆధారాలు బయటపెట్టిన సరికి ప్లేట్ ఫిరాయించారని  చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు.  వైయస్ వల్లే కియా  పరిశ్రమ వచ్చిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన మండిపడ్డారు.  అసెంబ్లీ వేదికగా గత  తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై వైకాపా ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆరోపణలను తిప్పి కొట్టాలని  తమ్ముళ్లకు  . చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. లేకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది .


  శాసనసభా సమయాన్నంతా   ప్రతిపక్షాలను విమర్శించడానికే జగన్మోహన్ రెడ్డి  వెచ్చిస్తున్నారని , ప్రజాసమస్యలపై చర్చించేందుకు ఆయనకు ఆసక్తే లేదని ఈ సందర్బంగా చంద్రబాబు విమర్శించారు . టిడిపి ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు 66 శాతం పూర్తయిందన్న  చంద్రబాబు… కేంద్రం నుండి నిధులు తెచ్చుకోవడం చేతకాదని వైకాపా ప్రభుత్వం, గత  టిడిపి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుందని విమర్శించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: