కాపు రిజర్వేషన్ అంశం  అసెంబ్లీలో మరోసారి తెరపైకి వచ్చింది. కాపుల  రిజర్వేషన్ల విషయంలో ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి  వైఖరి ఏమిటో చెప్పాలంటూ ,  ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు లేవనెత్తిన ప్రశ్నకు  జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ కాపులకు తాము ఎన్నికల ముందు చెప్పింది చేశామని , ఇక రిజర్వేషన్ల అంశం తమ చేతిలో లేదని సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నదని వెల్లడించారు . కాపులకు  చంద్రబాబు నాయుడు తీరని అన్యాయం చేశారని జగన్మోహన్ రెడ్డి  మండిపడ్డారు.


 రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి  ఐదేళ్లు వారిని  మోసం చేసింది చాలక , ఎన్నికల ముందు అగ్రవర్ణాల పేదలకు కేంద్రం కల్పించిన పదిశాతం రిజర్వేషన్లలో , కాపులకు  ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మరోసారి మోసం చేసే ప్రయత్నం చేశారని అన్నారు . కానీ ఎన్నికల్లో కాపులు టీడీపీ కి తగినరీతి లో బుద్ధి చెప్పారని జగన్మోహన్ రెడ్డి అన్నారు .  అగ్రవర్ణాల కోటలో కేటాయించిన పదిశాతం రిజర్వేషన్లలో  ఐదు శాతం రిజర్వేషన్లు కాపులకు కేటాయించడం చెల్లదన్న జగన్ ,   కాపుల రిజర్వేషన్ అంశం  సుప్రీం కోర్టు పరిధిలో ఉందని పేర్కొనడం ద్వారా , తన చేతుల్లో లేదని చెప్పకనే చెప్పారు .  2014 ఎన్నికల ముందు కాపులకు  రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారం లోకి వచ్చిన వెంటనే ,  మంజునాథ కమిషన్ ఏర్పాటు చేశారు .


 కమిషన్ నివేదిక ఆధారంగా కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టారు .  అయితే రాష్ట్రంలో రిజర్వేషన్ల  50 శాతానికి మించడం తో , రాజ్యాంగ  సవరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం , కేంద్రానికి నివేదిందించి .  కేంద్ర ఈ బిల్లును తిరస్కరించడంతో కాపుల రిజర్వేషన్ల అంశం  మళ్లీ మొదటికి వచ్చింది.  ఎన్నికల ముందు కేంద్రం తీసుకొచ్చిన అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లలో కాపులకి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం  తీర్మానం చేసి ఎన్నికలకు వెళ్ళింది . ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమి చెందడం తో కాపు రిజర్వేషన్ల అంశం ఎక్కడ మొదలయిందో అక్కడికే వచ్చింది .


మరింత సమాచారం తెలుసుకోండి: