'సినిమాల్లో మనకు విలన్‌ కేరక్టర్‌ కనిపిస్తుంది. ఈ మనిషిని, చూస్తేనే విలన్‌ కేరక్టర్‌ కనిపిస్తాడు. సినిమా నుంచి ఆ యాంగిల్‌ ఇక్కడికి మూవ్‌ చేస్తే.. ఇక్కడ చంద్రబాబు కనిపిస్తారు.''
'' అచ్చన్నాయుడు అనే వ్యక్తి భూమ్మీద అంత ఎత్తు, లావు పెరిగినాడు. ఇక్కడ ఉండాల్సిన (తలను చూపిస్తూ) బుర్ర అరికాలిలో కూడా లేదు. ఆ సైజులో ఎందుకున్నాడో నాకు తెలియదు. ఆ బుర్ర ఎందుకు పెరగలేదో ఆయన అంతట ఆయన ప్రశ్నించుకోవాలి.''    వై.ఎస్‌. జగన్‌

'' చంద్రబాబు రాష్ట్రం మారినా, ఇల్లుమారినా ఉపయోగం లేదు,మనిషి మారాలి...'' అంబటి రాంబాబు.
''టెక్కలిలో కూడా రోజూ ఇదే గోల. 'నీయమ్మ ఏంట్రా బాబూ ఈఖర్మ. అనవసరంగా అసెంబ్లీకి పంపించాం' అని అనుకుంటున్నారు''   పేర్ని నాని

 ఇటీవల అసెంబ్లీలో చోటు చేసుకున్నఆణిముత్యాలివి. ప్రజాధనంతో నడిచే సభలో ప్రతీ నిముషం విలువైనది అనే ఆలోచన సభ్యుల్లో, ముఖ్యంగా అధికార పార్టీ సభ్యుల్లో ఉండాలి. ఇలా ఒకర్ని ఒకరు తిట్టుకోవడం, మరో వైపు సుమతీ శతకాలు విన్పించడం, పిట్టకతలు చెప్పడం అవసరమా...

గతాన్ని తవ్వుతూ, ప్రతిపక్షాలను విమర్శించడం వల్ల ఫలితం ఏముందీ.. వారు సరిగా లేకనే కదా ఇపుడు వైసీపీకి అవకాశం ఇచ్చారు ప్రజలు. మీరు కూడా అలానే వ్యవహరిస్తే, ప్రజలు గమనించరా..?
రాష్ట్రం అసలే అప్పుల్లో ఉంది. రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువ. సమస్యలు కోకొల్లలు... ఇలాంటి పరిస్ధితిలో... సభలో పరదూషణ అవసరమా..?
మీ పరస్పర విమర్శలను లైవ్‌ టెలికాస్ట్‌లో చూస్తున్న ప్రజలు '' ఇది అసెంబ్లీనా చేపల మార్కెట్టా...?'' అని చికాకు పడుతున్నారు.

కొన్ని పొరపాట్లు ఉండవచ్చు. అంతమాత్రాన చంద్రబాబు నాయుడిని పదే పదే అవమానించడం సంస్కారం కాదు.ఆయన వయస్సును, అనుభవాన్ని గౌరవించి,వారి సలహాలు తీసుకోవాలి. ఈ విషయంలో పాలకపక్షం సానుకూలంగా ఆలోచించాలి.

అంబటి రాంబాబు అన్నట్టు, చంద్రబాబు కున్న అనుభవం లేక పోయినా, ప్రజలకు మేలు చేసే బుర్ర ఉన్న యువనాయకుడు జగన్‌ ఈ దిశగా అడుగులు వేయాలి. కొందరు నాయకులను పదే,పదే బాడీషేమింగ్‌ చేయడం కూడా , సమంజసం కాదని జగన్‌ గారు గుర్తించాలి.
ఇప్పటి వరకు జరిగింది చాలు,
సభలో విమర్శలు ఆపి ఇరు పక్షాలు రాష్ట్రప్రగతి కోసం నిర్మాణాత్మక చర్చలు జరపాలని రాజకీయ పరిణామాలను గమనిస్తున్న సామాజిక,రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సుధీర్ఘ పాదయాత్రలో సమాజాన్ని దగ్గరగా చూసిన, పరిణతి ఉన్న నాయకుడు వైఎస్‌ జగన్‌ , అందరినీ కలుపుకొని పోతూ.. శాసన సభలో, సరికొత్త సంప్రదాయానికి నాంది పలుకుతారని ఆశిద్దాం!! 


మరింత సమాచారం తెలుసుకోండి: