ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ అధికారికంగా రాజీనామా ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. పార్టీ భవిష్యత్ బాగుండాలంటే జవాబుదారీతనం ముఖ్యమని, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దేశానికి జీవనాడి వంటి పార్టీకి అధ్యక్షుడిగా సేవలందించినందుకు గర్వంగా ఉన్నదన్నారు. తన రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తద్వారా తన రాజీనామాపై సాగుతున్న ఉత్కంఠకు తెరదించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) వెంటనే పార్టీ అధ్యక్షుడిగా వేరొకరిని ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. దీంతో తాజాగా కాంగ్రెస్ పార్టీ ఓ షార్ట్ కట్ క‌నుగొంది.


ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మే 27న జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో పార్టీ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన రాజీనామా లేఖను అందించారు. సీడబ్ల్యూసీ ఆ లేఖను తిరస్కరించినా.... నాటి నుంచి హై డ్రామా కొనసాగుతున్నది. ఆయన్ను బుజ్జగించేందుకు పార్టీ నేతలు ప్రయత్నించారు. ఆయన కొనసాగాలంటూ పార్టీ కార్యకర్తల ధర్నాలు, నేతల మూకుమ్మడి రాజీనామాలూ కొనసాగినా రాహుల్‌గాంధీ వెనక్కి తగ్గలేదు. రాజీనామా లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేసిన రాహుల్ ``ఆదర్శాలు, విలువలతో అందమైన ఈ భారత్‌కు జీవనాడిగా మారిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా సేవలందించినందుకు గర్వ పడుతున్నా. దేశ ప్రజల, నా పార్టీ కార్యకర్తల ప్రేమాభిమానాలకు రుణపడి ఉంటాను` అని ట్వీట్ చేశారు. 


పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపికలో తన ప్రమేయం ఏమాత్రం ఉండబోదని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. ``నేనిప్పడు కాంగ్రెస్ అధ్యక్షుడిని కాదు. నా రాజీనామాను సీడబ్ల్యూసీకి సమర్పించాను. వెంటనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించా. అన్ని స్థాయిల్లోనూ పార్టీ ప్రక్షాళన జరుగాలని స్పష్టం చేశాను`` అని అన్నారు. కొత్త అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవాలో సూచించాలని తనను కోరారని, అధక్షుడి ఎంపికలో తన ప్రమేయం ఉండదని, అది సీడబ్ల్యూసీ బాధ్యత అని, తాను ఇప్పుడు పార్టీలో ఓ సభ్యుడిని మాత్రమేనని చెప్పారు. ఏదేమైనా అధికారాన్ని అట్టిపెట్టుకోవడం మనదేశంలో ఓ అలవాటుగా మారింది. కానీ.. త్యాగాలకు సిద్ధం కాకుండా, అధికారంపై వ్యామోహాన్ని విడువకుండా మన శత్రువును జయించలేం అని అన్నారు. రాహుల్ తన ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు అనే వాక్యాన్ని తొలిగించి కాంగ్రెస్ పార్టీ సభ్యుడుగా మార్చుకున్నారు. 


అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ రాజీనామాను పార్టీ అత్యున్నత వేదిక అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఇంకా ఆమోదించలేదు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని రాహుల్‌గాంధీని సీడబ్ల్యూసీ కోరినప్పటికీ ఆయన ససేమిరా అన్నారు. అయితే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇవి ముగియగానే సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని, ఈ సందర్భంగా రాహుల్ రాజీనామాను ఆమోదించవచ్చని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. ఆరు నెలల పాటు పార్టీ వ్యవహారాల బాధ్యతలను చూడటానికి ప్రధాన కార్యదర్శిని నియమించే అవకాశముందని, త్వరలో జరుగనున్న పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ పరంగా బాధ్యత వహిస్తారని తెలిపారు. అధ్యక్షుడి ఎన్నిక వరకూ ఈ ప్రధాన కార్యదర్శే పార్టీకి పెద్ద దిక్కు అని పేర్కొన్నారు. వాస్తవానికి అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి పార్టీ ముఖ్య నేతలు పలుసార్లు సమావేశమై చర్చించినప్పటికీ ఏకాభిప్రాయం రాకపోవడంతో ఈ కొత్త ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చే అవకాశముందని ఆయన వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: