పోలవరం ఒప్పందానికి విరుద్ధంగా కొత్త రేట్లు, హైడల్‌ ప్రాజెక్టుకు రూ.787 కోట్ల ముందస్తు చెల్లింపులు, ప్రత్యేక నిధి, రివాల్వింగ్‌ ఫండ్‌ ఖర్చుకు ఆడిట్‌ లేదు, నిబంధనలు పాటించలేదు... ఇవీ క్లుప్తంగా పోలవరంపై నిపుణుల కమిటీ నివేదికలో వెల్లడైన నిజాలు. 

ఆంధ్ర ప్రదేశ్‌లో చేపట్టిన జలవనరుల ప్రాజెక్టులు, ఇతర నిర్మాణ ప్రాజెక్టుల్లో జరిగిన ఉల్లంఘనలను పరిశీలించడానికి, జూన్‌ 14న రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.మాజీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు ఎఫ్‌సిఎస్‌ పీటర్‌, అబ్దుల్‌ బషీర్‌, పి.సుబ్బరాయశర్మ, ఎల్‌.నారాయణరెడ్డి, ప్రముఖ స్ట్రక్చరల్‌ ఇంజినీరు పి.సూర్యప్రకాష్‌, ఏపీ జెన్‌కో విశ్రాంత డైరక్టర్‌ ఆదిశేషు, మాజీ చీఫ్‌ ఇంజినీరు ఐఎస్‌ఎన్‌ రాజు, ఈ కమిటీలో ఉన్నారు.
పోలవరంపై పరిశీలన పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దానిలోని అంశాలు...
1,పోలవరం సాగునీటి ప్రాజెక్టు, జలవిద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా రూ.2343.85 కోట్ల మేర కాంట్రాక్టర్లకు అదనపు ప్రయోజనాలు కల్పించారని నిపుణుల కమిటీ తేల్చింది.
2, పోలవరం సాగునీటి ప్రాజెక్టులో ఒక ప్రధాన కాంట్రాక్టర్‌తో తొలి ఒప్పంద గడువు ముగియకముందే... 2015-16 ధరలు వర్తింపజేయడం వల్ల ఆ కంపెనీకి రూ.1331 కోట్ల మేర అదనపు ప్రయోజనం కలిగింది.
3, ఈ నేపథ్యంలో ప్రస్తుత కాంట్రాక్టర్లను కొనసాగించడమా లేక వారిని తొలగించి కొత్త వారితో పనులు చేయించడమా అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కమిటీ సూచన.
4,దీనికి న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సలహా ఇచ్చింది.
5, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పబ్లిక్‌ వర్క్స్‌ నిబంధనలన్నీ ఉల్లంఘించారని, కాంట్రాక్టర్లతో ఉన్న నియమాలను పూర్తి స్థాయిలో పక్కదారి పట్టించి, ఒప్పందానికి విరుద్ధంగా కాంట్రాక్టరుకి ఎన్నో ప్రయోజనాలు కల్పించారని కమిటీ తప్పు పట్టింది.
6, గుత్తేదారుకు కొత్త ధరలు ఇవ్వడం ఒప్పందానికి విరుద్ధం.
7,పోలవరం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సిఫార్సుల మేరకు ప్రభుత్వం జీవో ఆర్‌టి నంబరు 253 ద్వారా రూ.25 కోట్లతో పోలవరం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆ తర్వాత రూ.170 కోట్లకు పెంచింది. రోజువారీ కూలీలు, డీజిల్‌, ఇంధన ఖర్చులకు ఈ నిధి ద్వారా చెల్లింపులు జరపొచ్చు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఏ అవసరాలకైనా ఈ నిధి నుంచి చెల్లింపులు జరిపేలా జీవోలో మార్గదర్శకాలు ఉన్నాయి.
8, ప్రభుత్వశాఖ ద్వారా చెల్లింపులు జరుపుతూ గుత్తేదారు మెటీరియల్‌ కొనుగోలు చేసినప్పటికీ వాటిపై తనిఖీ, పర్యవేక్షణ ఉండాలి. ముందస్తుగా చెల్లించిన సొమ్ములకు సంబంధించి రావాల్సిన మెటీరియల్‌ అసలు వచ్చిందా లేదా అని తనిఖీ చేసే వ్యవస్థ అక్కడ లేదు.
9, 7-ఎఫ్‌ ఖాతాల నిర్వహణ సరిగ్గా జరగలేదు. నాణ్యత నియంత్రణ తనిఖీలకు కూడా ఈ నిధి నుంచే చెల్లింపులు జరిపారు. గుత్తేదారు అక్కడ నాణ్యత నియంత్రణ పరిశోధన స్థానం ఏర్పాటు చేశారనేదానికి రికార్డుల పరంగా ఎలాంటి ఆధారాలు లేవు.
10, ప్రత్యేక నిధి చెల్లింపులకు ఎలాంటి ఆడిట్‌ తనిఖీలు లేవు. సమగ్ర రికార్డులు కూడా లేవు. ఓచర్లలో వివరాలు లేవు. అకౌంట్స్‌ కోడ్‌ పేరా 90ని పూర్తిగా ఉల్లంఘించారు.
11, చెక్‌ మెజర్‌మెంట్‌కు ముందు పనుల తనిఖీలూ లేవు. ఇంజినీరింగు పనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ వర్క్సు అకౌంట్‌ కోడ్‌ ప్రకారం అనుసరించాల్సిన ప్రొసీజర్‌ను పోలవరం ప్రాజెక్టులో ఎక్కడా అమలు చేసిన దాఖలాలు లేవు. ఈ కోడ్‌ ప్రకారం.. ప్రతి వారం రేషన్‌, ఆహారం, క్యాంటీన్లకు సంబంధించి పెద్ద మొత్తంలో ముందస్తు చెల్లింపులు జరిపారు. ఆ చెల్లింపులకు సంబంధించిన వస్తువులు నిజంగా చేరాయా లేదా అని తనిఖీ చేసిన వారెవ్వరూ లేరు.


మరింత సమాచారం తెలుసుకోండి: