ఒక పక్క పాలనలో జగన్ దూసుకుపోతుంటే, మంత్రులు మాత్రం చాలా నింపాదిగా ఉన్నారు. దీనితో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశముంది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇప్పటి వరకూ స్కూల్ పిల్లల లాగే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. అయితే జగన్ ప్రవేశ పెట్టిన కొత్త పథకం "జగనన్న విద్యాదీవెన" ద్వారా వీరందరికీ ఏటా 20 వేల రూపాయలు అందిస్తారు. అంటే ఇప్పుడున్న స్కాలర్ షిప్ స్థానంలో 20 వేల రూపాయల లబ్ధి చేకూరుతుంది. అయితే ఈ పథకం తెచ్చిన తర్వాత మధ్యాహ్న భోజనానికి విరామం ప్రకటించారు. దీంతో ఇంటర్మీడియట్ విద్యార్థులు సహజంగానే రోడ్డెక్కారు.


బీజేపీ, టీడీపీ అనుకూల విద్యార్థి సంఘాల మద్దతుతో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మంత్రులపై ఉంది. విద్యార్థులకు లభిస్తున్న ప్రయోజనాలను వివరించి, మధ్యాహ్న భోజనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అయితే మంత్రులు ఎక్కడా సమర్థంగా వివరణ ఇచ్చిన దాఖలాలు లేవు. అదే ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందిగా, టీడీపీకి ఆయుధంగా మారింది.


ఈ విషయంలో ఒక్క ఎంపీ విజయ సాయిరెడ్డి మాత్రమే స్పందించారు. అది కూడా ట్విట్టర్ లో సమాధానమిచ్చారు. చంద్రబాబు చేయిస్తోన్న విష ప్రచారాన్ని తిప్పికొట్టారు. విజయసాయి బాటలో మిగతా మంత్రులు కూడా వెంటనే రియాక్ట్ అవ్వాలి. ప్రభుత్వ ఆలోచనను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. విద్యార్థుల దృష్టిలో చెడ్డపేరు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: