బిడ్డపోయినా పురిటికంపు పోలేదన్న సామెతలాగుంది కాపు రిజర్వేషన్ల అంశం. అసెంబ్లీ సమావేశాల్లో కాపుల రిజర్వేషన్ల అంశం మంగళవారం ఓ ఊపు ఊపేసింది. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నది 2014లో చంద్రబాబునాయుడు హామీ. హామీని అమలు చేయలేక బోల్తాపడింది చంద్రబాబు. తన హామీని ఇపుడు జగన్మోహన్ రెడ్డి తలకు చుట్టాలని చంద్రబాబు చూడటంతో అసెంబ్లీ సమావేశం చాలా వాడిగా వేడిగా సాగింది.

 

కాపులకు రిజర్వేషన్ కల్పించి బిసిల్లో కలుపుతానని చెప్పిన చంద్రబాబు ఆ పనిచేయలేక బోల్తాపడ్డాడు. దాంతో కాపులను ఆకట్టుకునేందుకు చంద్రబాబు చాలానే విన్యాసాలు చేసినా ఎవరూ నమ్మలేదు. మొన్నటి ఎన్నికల్లో కాపుల్లో మెజారిటి సెక్షన్ వైసిపికి మద్దతుగా నిలబడింది.

తాను తప్పుడు హామీలిచ్చిన విషయాన్ని అంగీకరించని చంద్రబాబు తన హామిని అమలు చేయాలని జగన్ పై అసెంబ్లీలో ఒత్తిడి తెచ్చారు. దాంతో ఒళ్ళుమండిపోయిన జగన్ మాజీ సిఎంపై తీవ్ర స్ధాయిలో మండిపోయారు. అంతకుముందే ఇదే అంశంపై వైసిపి సభ్యుడు అంబటి రాంబాబు తదితరులు కూడా చంద్రబాబును ఓ ఆటాడుకున్నారు.

 

మొత్తం మీద కాపుల రిజర్వేషన్ అంశం అసెంబ్లీని ఇంకా కుదిపేస్తోంది. హామీలిచ్చి మాట తప్పిన చంద్రబాబు ఫలితం అనుభవించినా ఇంకా అదే అంశం పాలక, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్ధాయిలో మాటల యుద్ధం నడుస్తుండటమే విచిత్రంగా ఉంది. మరి ఎప్పటికి ఈ అంశం సద్దుమణుగుతుందో ఏమో చూడాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: