2019అసెంబ్లీ ఎన్నికలు ముగిసి వైసీపీ అధికారంలోకి, టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. చంద్రబాబు క్షేత్రస్థాయిలో జరుగుతున్న, ఇసుక, మట్టి దందాలపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ప్రజల ఆగ్రహానికి గురై పరాజయం పాలయ్యారు. జగన్ దీన్ని అనుకూలంగా మలచుకుని క్షేత్రస్థాయి సమస్యలే అజెండాగా ప్రజల్లోకి వెళ్లి అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పటికీ చంద్రబాబు తన తప్పులను గమనించినట్టుగా లేదు.

 

 చంద్రబాబు అధికారంలో ఉండగా పార్టీ నేతలతో జరిపిన టెలీకాన్ఫరెన్సులు ఆయనపై పార్టీ నేతలకు కొంత అసంతృప్తి కలిగేలా చేశాయనేది కొందరి వాదన. ఇప్పటికీ టెలీకాన్ఫరెన్సులతో పార్టీ వారికి ఉపదేశం చేస్తున్నట్టున్నారు. ఇసుక అక్రమ రవాణాతో వైసీపీ నేతలు, ఎంపీ వర్గం, ఎమ్మెల్యే వర్గం పోటీపడి ఇసుక దోచేస్తున్నారని, దీనిపై పరస్పరం పోలీసు కేసులు పెట్టుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇసుక కొరతతో రాజధానిలో పనులు నిలిచిపోయి, పనులు లేక భవన నిర్మాణ రంగం కుదేలైందని, పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని పార్టీ నేతలతో అంటున్నారు. కానీ.. టీడీపీ హయాంలో ఆపార్టీ నేతలు, కార్యకర్తలు ప్రధానంగా ఇసుక దందా మీదే ఎక్కువ ఫోకస్ చేయటం వల్లే పార్టీ అప్రతిష్ట పాలైందని మర్చిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో ఏర్పేడు మండలంలో ఒకే గ్రామానికి చెందిన 20మందికి పైగా ప్రజలు ఇసుక అక్రమాలపై ఆందోళన చేస్తూ లారీ ఢీకొనటంతో అందరూ మృత్యువాత పడ్డారు. మృతులకు పరిహారం అందించి అందుకు కారణమైన టీడీపీ నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కానీ రెండు నెలల్లోనే మళ్లీ పార్టీ సభ్యత్వం ఇచ్చారు.

 

 ఇదంతా జరిగిన నిజం. మరి చంద్రబాబునాయుడు ఏ విధంగా వైసీపీ నాయకులను ఇసుక మాఫియాకు అంటగడతారు. ఇసుక మాఫియాపై తెలుగు తమ్ముళ్లు చేస్తున్న అరాచకాలను ఏమాత్రం అరికట్టినా ఈరోజు టీడీపీకి ఈ పరిస్థితి ఉండేది కాదు. తమ హయాంలో ఇసుక ఉచితమని చెప్పి పార్టీ వారికి ద్వారాలు తెరిచారు. రెండో సారి అధికారానికి ద్వారాలు మూసుకుపోయాయి. మరి అప్పుడు అడ్డు చెప్పకుండా ఇప్పుడు మాత్రం విమర్శలు చేస్తున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: