మంచి రోడ్లు కావాలంటే టోల్‌ టాక్స్ కట్టాల్సిందేనంటూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అవుతున్నాయి. రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం దగ్గర సరిపడా నిధులు లేనందునే టోల్‌ వ్యవస్థ ఇంకా కొనసాగుతుందని నిన్న లోక్‌సభలో క్లారిటీ ఇచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో టోల్‌ వసూలుపై కొందరు ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ అంశంపై లోక్ సభలో గడ్కరీ సమాధానమిస్తూ సామర్థ్యం ఉన్న ప్రాంతాల నుంచి టోల్‌ టాక్స్ తీసుకుని, గ్రామాలు.. కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఆ నిధులను ఖర్చు చేస్తున్నామని వివరించారు. అంతే కాదు.. టోల్‌ అనేది జీవితాంతం ఉంటుంది. కొద్దిగా పెరగొచ్చు లేదా కొద్దిగా తగ్గొచ్చు అంటూ మరింత స్పష్టత ఇచ్చారు. రహదారుల అభివృద్ది కోసం టోల్ టాక్స్ అనే విషయంలో ఎవరినీ తప్పుపట్టలేం.


కానీ ఈ టోల్ టాక్స్ ఎంత కాలం వరకూ అనే అంశంపైనే వివాదమంతా తిరుగుతోంది. ఆ రహదారు నిర్మాణానికి ఖర్చయిన మొత్తం.. నిర్వహణ మొత్తం తిరిగి వచ్చేవరకూ టోల్ టాక్స్ విధించడం సబబుగా ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. ఇలా టోల్ వసూలు జీవితకాలం విధించడం సబబు కాదని వారు వాదిస్తున్నారు. ప్రజల సొమ్ముతో అభివృద్ధి అన్నది మంచిదే కానీ దానికో పరిమితి కూడా ఉండాలన్నది ఆ వాదన సారాంశం.


అయితే అమెరికా సంపన్న దేశం కాబట్టి అక్కడ రోడ్లు బాగోవడం కాదు, రోడ్లు బాగున్నాయి కాబట్టే అమెరికా ధనిక దేశం అయింది’అని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెనడీ చెప్పిన విషయాన్ని గడ్కరీ నిన్న గుర్తుచేశారు. ఆ విషయాన్ని ఎవరూ కాదన లేరు.. అదే సమయంలో పన్నులు అనేవి పుష్పంపై మకరందాన్ని గ్రోలినంత సున్నితంగా ఉండాలని మన చాణక్యుడు చెప్పిన విషయాన్ని కూడా కేంద్ర మంత్రి గుర్తు చేసుకుంటే ఇంకా బావుంటుందంటున్నారు భారత ప్రజ.


మరింత సమాచారం తెలుసుకోండి: