ఈటీవీ ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్ చూసి ఏపీ సీఎం జగన్ షాక్ అయ్యారు. ఆ ఛానల్లో వచ్చిన ఓ వార్త ఆయన్ను షాక్ కు గురి చేసింది. ఆయన వెంటనే ఆ వార్తపై స్పందించారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.


ఇంతకీ ఆ వార్త ఏంటంటే..

విశాఖలోని గాజువాకకు చెందిన 8 నెలల చిన్నారి పర్ణిక పేగు వ్యాధితో బాధపడుతోంది. మలమూత్రాలు బయటకు రావడం లేదు. పేగు నుంచి రక్తస్రావం జరుగుతోంది. ఆసుపత్రికి తీసుకెళ్తే వెంటనే ఆపరేషన్ చేయాలి.. 5 లక్షలు ఖర్చవుతాయన్నారు.


అంత సొమ్ములేని పాప తల్లిదండ్రులు అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎంను కలిసేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో వీరి సంగతి ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌ విలేఖరి తెలుసుకున్నారు. తమ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ వేయించారు.


ఆ బ్రేకింగ్ న్యూస్ చూసి జగన్ వెంటనే స్పందించారు. పాప పరిస్థితిపై ఆరా తీసి వెంటనే చిన్నారి ఆపరేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు చిన్నారికి విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రికి చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. పాపకు మెరుగైన వైద్యం అందించాలని, ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. పనికిరాని వార్తలను సంచలనాల పేరుతో ఇచ్చేకంటే.. ఇలాంటి మానవీయ కథనాన్ని వెలుగులోకి తెచ్చిన ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ను మెచ్చుకోవలసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: