అగ్ర‌రాజ్యం అమెరికా అంటేనే....క‌ఠిన‌మైన ష‌ర‌తుల‌కు మారుపేరు. తోచిన‌ప్పుడ‌ల్లా నిబంధ‌న‌ల‌ను మారుస్తూ...ఆశావ‌హుల‌కు షాకులు ఇచ్చే దేశం. అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్ ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఈ దోర‌ణి మ‌రింత పెరిగింది. గత కొంతకాలంగా వలసల విషయంలో కఠినమైన ఆంక్షలు అమెరికా విధిస్తోంది. అయితే, ఈ దోర‌ణికి ఫుల్ స్టాప్ ప‌డ‌నుంది. విద్యాభ్యాసం, ఉద్యోగాల కోసం అమెరికా వచ్చే వారికి ఇకపై మరింత అధికంగా అవకాశాలు కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు ప్రతిభ ఆధారిత ఇమిగ్రేషన్‌ కోటాను ప్రస్తుతం ఉన్న 12 శాతం నుంచి 57 శాతానికి పెంచుతామని పేర్కొంది. ట్రంప్‌ అల్లుడు, అధ్యక్షుడి సీనియర్‌ సలహాదారుడు జారెడ్‌ కుష్నర్‌ వైట్‌హౌస్‌లో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 


చట్టబద్ధ వలస విధానంలో ప్రతిభ ఆధారంగా ఇచ్చే కోటాను 12 శాతం నుంచి 57 శాతానికి పెంచేందుకు చర్యలు ముమ్మరం చేసినట్టు జారెడ్‌ కుష్నర్‌ పేర్కొన్నారు. ఇందులో సగం కుటుంబపరమైన కారణాలు, మానవతా ప్రాతిపదికన ఇవ్వనున్నట్టు తెలిపారు. ‘ప్రస్తుతం అమెరికా అనుసరిస్తున్న వలస విధానం చాలా పాతది. ప్రతిభ ఆధారిత కోటా ద్వారా కేవలం 12 శాతం మంది మాత్రమే ఇమిగ్రేషన్‌ అనుమతులు పొందుతున్నారు. కానీ చాలా దేశాల్లో ఈ కోటా ఎక్కువగా ఉంది. అందుకే అమెరికాలో దీన్ని 57 శాతానికి పెంచాలని ట్రంప్‌ ప్రతిపాదించారు’ అని కుష్నర్‌ తెలిపారు. గత ఏడాది 11 లక్షల మందికి అమెరికా పౌరసత్వం లభించిందని, అయితే, ఆ సంఖ్యను మార్చకుండా.. ప్రతిభ ఉన్న వాళ్ళ శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.


కాగా, భార‌త్‌తో సంబంధాల విష‌యంలో అమెరికా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. వైట్‌హౌస్‌లో జరిగిన అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) ద్వితీయ నాయకత్వ సదస్సులో కుష్న‌ర్ ఇదే అంశాన్ని వ్య‌క్తీక‌రించారు. భారత్‌తో ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై అమెరికా ప్రత్యేక దృష్టి సారించిందని జారెడ్ కుష్నర్ చెప్పారు. ``అమెరికాను అంతర్జాతీయం గా మరింత పోటీ పడగల వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా భారత్ వంటి దేశాలతో సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. భారత్‌లో అద్భుతమైన విద్యావంతుల జనాభా ఉంది. అమెరికాతో భారతీయులకు సారూప్య విలువలు ఉన్నాయి`` అని చెప్పారు. ట్రంప్ వలస ఉద్యోగులకు వ్యతిరేకి కాదని, అక్రమ వలసలకు వ్యతిరేకమని స్పష్టంచేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: