తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్ర‌త్యేకంగా సమావేశం కానుంది. కొత్త మున్సిపల్​ చట్టానికి సంబంధించిన బిల్లుకు ఆమోదం కోసం కేవలం రెండురోజుల పాటే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం ప్రారంభం కానున్న స‌మావేశాలు శుక్ర‌వారంతో ముగియ‌నున్నాయి.  అసెంబ్లీ గురువారం ఉదయం 11 గంటలకు, శాసన మండలి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే సభలో సీఎం కేసీఆర్​ కొత్త మున్సిపల్​ బిల్లును ప్రవేశపెడుతారు. అనంతరం దానిపై సభ్యుల అధ్యయనానికి ఒక్కరోజు సమయమిస్తూ స్పీకర్‌ సభను శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తారు. శుక్రవారం మున్సిపల్‌ చట్టంపై చర్చిస్తారు. ఆ తర్వాత సీఎం సమాధానం చెప్తారు. అదేరోజు బిల్లుకు ఆమోదం లభించగానే స్పీకర్‌ నిరవధికంగా అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేస్తారు. అసెంబ్లీలో ఆమోదించిన మున్సిపల్‌ బిల్లును శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ శాసనసభ మండలిలో  ప్రవేశపెడుతారు. ఆ వెంటనే చర్చించి మండలి ఆమోదం తీసుకుంటారు. మున్సిపల్‌ బిల్లుకు ఆమోదముద్ర పడిన అనంతరం డిప్యూటీ చైర్మన్‌ మండలి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తారు.


టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకొచ్చాక  మూడోసారి శాసనసభ, శాసన మండలి సమావేశమవుతున్నాయి. గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించిన నెల రోజుల తర్వాత ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ఇందుకు జనవరి 17 నుంచి 20 వరకు శాసనసభ సమావేశం కాగా, 19, 20 తేదీల్లో శాసనసభ మండలి సమావేశాలు జరిగాయి. అదే నెల 19న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన అనంతరం రెండు సభలు వాయిదాపడ్డాయి. ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు శాసనసభ, మండలి ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరిగాయి. 25న ద్రవ్య వినిమయ బిల్లుకు సభలు ఆమోదం తెలపడంతో ఆ సెషన్‌ ముగిసింది. మూడో సెషన్‌ గురు, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నారు.


కాగా, ప్ర‌స్తుత స‌మావేశాల్లో ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాప తీర్మానం పెట్టాలని అనుకున్నా, రెండురోజుల సెషన్‌ కావడంతో దాన్ని వాయిదా వేసుకున్నారు. ఆగస్టులో నిర్వహించే బడ్జెట్‌ సమావేశాల్లో సంతాప తీర్మానాలు పెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. అసెంబ్లీ, మండలి సమావేశాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశాలపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులు, పోలీసులతో సమీక్షించి చేపట్టాల్సిన చర్యలను వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: